మున్సిపల్ కార్యాలయం ముట్టడి
జయపురం: కాంగ్రెస్ పాలనలో ఉన్న జయపురం మున్సిపాలిటీపై విపక్ష బీజేడీ పత్రికా ప్రతినిదుల సమావేశంలో పలు ఆరోపణలు గుప్పించగా, నేడు మరో విపక్షం బీజేపీ మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించి చైర్మన్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. జయపురం బీజేపీ మండల అధ్యక్షుడు ఎస్.మనోజ్ కుమార్ నేతృత్వంలో బీజేపీ శ్రేణులు పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ మున్సిపాలిటీ, చైర్మన్, ఎమ్మెల్యే కార్యనిర్వాహక అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మున్సిపాలిటీకి చేరుకొని కార్యాలయాన్ని ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు 3 డిమాండ్లతో కార్యనిర్వాహక అధికారికి మెమోరాండం సమర్పించింది. అందులో మున్సిపాలిటీ చైర్మన్ తన సొంత పనులకు మున్సిపాలిటీ వాహనాలను వినియోగిస్తున్నారని, రోజుకు 30 లీటర్ల చొప్పున డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. పారిశుద్ధ్య కాంట్రాక్ట్‌లో ఎక్కువ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అలాగే మున్సిపాలిటీలో అభివృద్ధి, నిర్మాణ పనులలో అవినీతి తార స్థాయికి చేరుకున్నాయని, జగన్నాథ్ సాగర్ పునర్నిర్మాణ పనుల్లో అవినీతి జరుగుతోందని, ఒక రాజ్యాంగ పదవిలో ఉండి చైర్మన్ ఇతర వ్యాపారాలు చేస్తున్నారని, తమ వ్యాపారాల నిమిత్తం ఆయన హైకోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపిస్తూ వాటిపై వెంటనే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై దర్యాప్తు జరపాలని బీజేపీ నేతలు కొరాపుట్ విజిలెన్స్ డివిజన్ జయపురం అధికారులకు మెమోరాండం సమర్పిస్తూ డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన జరిపిన వారిలో సీనియర్ బీజేపీ నేతలు రాజేంద్ర మహాపాత్రో, మధు హియాల్, సురభి పాణి, శంతూన్ పండ తదితరులు ఉన్నారు.
మున్సిపల్ కార్యాలయం ముట్టడి


