యువత సన్మార్గంలో నడవాలి
జయపురం: యువత సన్మార్గంలో నడవాలని వక్తలు అన్నారు. అయితే నేటి సమాజంలో యువత మత్తు పానీయాలకు అలవాటు పడి, అక్రమ మార్గాలలో సంపాదించేందుకు చెడు మార్గాలు ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అటువంటి యువతను సక్రమ మార్గంలో నడిపేందకు కొరాపుట్ జిల్లా యువ సంఘటన ఆర్గనైజర్ సమాజ సూవి రవీంద్రకుమార్ మహపాత్రో ఆహ్వానం మేరకు పలువురు యువ నేతలు స్థానిక సిగ్నేచర్ హోటల్ సభాగృహంలో సోమవారం సమావేశం అయ్యారు. రవీంద్రకుమార్ మహపాత్రో అధ్యక్షన జరిగిన సమావేశంలో నేటి యువత పరిస్థితిపై సుధీర్ఘంగా చర్చించారు. యువత మంచి మార్గంలో నడచినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమన్నారు. నేటి యువత రేపటి తరాలకు మార్గదర్శులుగా ఉండాలన్నారు. ఎలాంటి వారితో కూడితే అలాంటి అలవాట్లే అలవడతాయని.. అందుకే మంచివారితో స్నేహం చేయాలన్నారు. మత్తు పదార్ధాలకు, చెడు అలవాట్లకు దూరంగా యువకులు ఉంటూ ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించుకోవాలన్నారు. యువతను మంచిమార్గంలో తీర్చిదిద్దేందుకు పాఠశాలలు ఆలయాలు కావాలన్నారు. తల్లిదండ్రులు ఎంతో కస్టపడి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే్‌ందుకు నిరంతరం ఆలోచిస్తారని వారి ఆశలను గౌరవించాలన్నారు. మంచి భవితను నిర్మించుకొనేందుకు ప్రతి యువత కలలు కనాలని పిలుపునిచ్చారు. తమ కలలు నిజం కావటానికి యువత కృషి చేయాలని ఉద్బోంధించారు. ముందుగా విద్యార్ధులు, యువత ‘నిషాకు నో’ చెప్పాలని, నిజాయితీ మార్గంలో సంపాదించేందుకు ప్రతి యువకుడు ప్రయత్నించాలని సూచించారు. తప్పుడు మార్గాలలో సంపాదించేందుకు ప్రయత్నిస్తే ఎన్నడూ సఫలం కాలేరని హితవు పలికారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని యువతకు పిలుపు నిచ్చారు. సమావేశంలో సిగ్నేచర్ హోటల్ యజమాని హిమాంక అగర్వాల, జయపురం మున్సిపల్ మాజీ కౌన్సిలర్, బీజేడీ నేత అరుగుల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు సతీష్ నంద, వ్యాపార వేత్త బుల్లు దేవ్ శర్మ, కంట్రాక్టర్, కృష్ణ గౌఢ, సమాజ సేవి సంజయ్ జైన్, వివిధ వర్గాలకు చెందిన యువకులు ప్రసంగించారు.


