బీజేపీలో చేరిన సునాబెడా మున్సిపల్ చైర్మన్
కొరాపుట్: ప్రతిపక్ష బీజేడీకి చెందిన సునాబెడా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర కుమార్ పాత్రో అధికార బీజేపీలో చేరారు. సోమవారం రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిర కార్యక్రమంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఇదే వేదిక మీద బీజేడీకి చెందిన ముగ్గురు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. వీరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్ మోహన్ సామాల్ కండువా కప్పి స్వాగతం పలికారు. రాజేంద్ర పాత్రో గత మున్సిపల్ ఎన్నికలలో కొరాపుట్ జిల్లా సునాబెడా నుంచి ఇండిపెండెండ్ అభ్యర్థిగా గెలుపొంది అప్పటి అధికార పక్షం బీజేడీలో చేరారు. ప్రస్తుతం దేశంలో నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీలో చేరినట్లు రాజేంద్ర ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీకి చెందిన కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో, పార్టీ నాయకుడు సుమంత్ ప్రధాన్ ఉన్నారు.


