వెనుజులాపై దురాక్రమణ దారుణం
జయపురం: వెనుజులా దేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైనికులు అక్రమంగా దాడులు నిర్వహించి ఆ దేశాధినేత నికోలాస్ మదురోను అతడి ధర్మపత్నిని బంధించి ఎత్తుకు పోయి అమెరికాలో న్యూయార్క్ పట్టణానికి తీసుకు పోయి నిర్భందించటం దుర్మార్గమని కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. నేడు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రామకృష్ణ దాస్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు అమెరికా అధ్యక్షుని చర్యకు నిరసనగా జయపురంలో ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ ట్రంప్ చర్య కేవలం అన్యాయమే కాదు ఇతర దేశాల అధికారాలపై మూడో స్థాయి గూండాల కన్నా అతి హీనంగా వ్యవహరించాడని దుయ్య బట్టారు. అమెరికా సామ్రాజ్యవాద, ట్రంప్ ప్రభుత్వ హీనమైన నరహంతక చర్యను ప్రపంచంలో అన్ని దేశాలు ఖండిస్తున్నాయని, అంతే కాకుండా అమెరికాలో ప్రజలు ట్రంప్ చర్యను నిరసిస్తూ ప్రదర్శనలు జరుపుతున్నా ట్రంప్ తన సామ్రాజ్యవాద పోకడలను కొనసాగిస్తూనే ఉన్నాడని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చూపి వెనుజులా దేశంలో ఆపారమైన చమురు సంపదను లూటీ చేసేందుకే బహిరంగంగా ఈ దుర్మార్గానికి పూనుకున్నాడని కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రామకృష్ణ దాస్ దుయ్యబట్టారు. వెంటనే మదురోను అతడి భార్యను భేషరతుగా విడిచి పెట్టాలని ఆ పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది. ర్యాలీలో పార్టీ జిల్లా మాజీ కార్మదర్శి జుధిష్టర్ రౌళో, నేతలు బసంత బెహర, సుదర్శణ బిశాయి, నంద హరిజన్, ధృభ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.


