సమగ్రాభివృద్ధే లక్ష్యం
కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక
ముగిసిన చొయితీ ఉత్సవాలు
రాయగడ: జిల్లాను సమగ్రాభివృద్ధి దిశగా తీర్చిదిద్దాలని కొరాపుట్ లోక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక అన్నారు. స్థానిక గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో గత నెల 26 నుంచి జరుగుతున్న చొయితీ ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఉలక మాట్లాడుతూ రాయగడ వంటి వెనుకబడిన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. అపార ఖనిజ సంపదలు ఉన్న ఈ జిల్లాలో ఉపాధి కరువు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. రహదారులు అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పారు. జిల్లాలో అభివృద్ధి కొంతమాత్రమే జరిగిందని, ఇంకెంతో చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైల్వేపరంగా రాయగడ డివిజన్‌గా రూపొందినా కార్యకలాపాలు, కార్యాలయాలు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు.
మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి..
ఆదివాసీ, హరిజన జిల్లాగా గుర్తింపు పొందిన ఈ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తున్నానని ఎంపీ పేర్కొన్నారు. ఇదే విషయమై రాజ్యసభలోనూ ప్రస్తావించానని చెప్పారు. అందుకు సంబంధించి అనువైన స్థలం రాయగడలో జేఎస్‌కో స్థలాలు ఉన్నాయన్నారు. ఇందులో ఆక్రమణలు ఖాళీ చేస్తే కొంతభాగం మెడికల్ కళాశాలకు ఉపయోగపడుతుందన్నారు. ప్రతి రోజూ లక్షల మంది జనం చొయితీ ఉత్సవాలను ఆస్వాదిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. అన్ని గ్రామీణ ప్రాంతాలకు సెల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు.
ఐదు రోజుల్లో రూ.6 కోట్ల వ్యాపారాలు
చొయితీ ఉత్సవాలను పురష్కరించుకుని జిల్లా యంత్రాంగం సుమారు 300 వందల వ్యాపార స్టాల్స్, ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేసిందని చొయితీ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ అశుతొష్ కులకర్ణి వెల్లడించారు. ఐదు రోజుల్లో సుమారు రూ.6 కోట్ల 80 లక్షల పైబడిన వ్యాపార లావాదేవీలు కొనసాగాయని వివరించారు. స్వయం సహాయక బృందాల మహిళలు, ఇతర ప్రాంతాల వ్యాపారాలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. వచ్చే ఏడాది స్టాల్స్ సంఖ్య పెంచడంతో పాటు ఉత్సవాలను మరింత ఘనంగా జరిగేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ తదితరులు పాల్గొన్నారు.
సమగ్రాభివృద్ధే లక్ష్యం


