పాత్రికేయుల సేవలు ప్రశంసనీయం
రాయగడ: పాత్రికేయుల సేవలు ప్రశంసనీయమని ప్రముఖ విద్యావేత్త డాక్టర్ డి.కె.మహంతి అన్నారు. స్థానిక రింగ్ రోడ్డులోని సెంచూరియన్ పబ్లిక్ స్కూల్లో దివంగత పాత్రికేయుడు సురేష్ పాఢి వర్ధంతి పురష్కరించుకుని నిర్వహించిన సురేష్ సన్మాన్–25 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పాత్రికేయ రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సమాజ సేవకు కృషి చేసే జర్నలిస్టుల్లో సురేష్ ఒకరని పేర్కొన్నారు. అంతకుముందు సురేష్ సన్మాన్–25 నిర్వాహకులు డాక్టర్ రాజేష్ పాడి, రాకేష్ పాడి కుటుంబీకులు పాల్గొని సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రముఖ పాత్రికేయులు భళ్లమూడి నాగరాజు, అధికారి, తదితరులు ప్రసంగించారు. ఈ ఏడాది సురేష్ సన్మాన్ –25 అవార్డును పాత్రికేయుడు శివప్రసాద్ దొరకు ప్రదానం చేశారు. జ్ఞాపికతో పాటు రూ.5 వేల నగదుతో సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ పాడి మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి సురేష్ సన్మాన్ అవార్డును పాత్రికేయులతో పాటు మరో ఇద్దరు విద్యావేత్తలు, సమాజ సేవకులకు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు.


