బిజు స్వాభిమాన్ మంచ్‌తోనే కార్యకలాపాలు
● రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి స్పష్టీకరణ ● బంధుమిలన్ పేరిట ప్రత్యేక సమావేశం ఏర్పాటు
రాయగడ: బిజు స్వాభిమాన్ మంచ్‌తోనే కార్యకలాపాలు కొనసాగిస్తామని రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక తేజస్వీ హోటల్ సమీపంలోని కార్యాలయంలో బంధుమిలన్ పేరిట నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది సెప్టెంబరు 9న నెక్కంటి బిజు జనతాదళ్ పార్టీకి గుడ్ బై చెప్పి బిజు స్వాభిమాన్ మంచ్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఆయనతో పాటు మూకుమ్మడిగా బీజేడీకి రాజీనామా చేశారు. అయితే మంచ్ ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా ఎటువంటి కార్యకలాపాలు లేకపొవడంతో మద్దతుదారుల్లో కొందరు ఇతర పార్టీల్లో చేరారు. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మద్దతుదారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనను నమ్ముకుని ఉన్న మద్దతుదారుల భవిష్యత్ దృష్ట్యా వారిని సరైన మార్గంలో నడిపించడంతో పాటు వారికి అండగా నిలవాలన్నదే తన ధ్యేయమన్నారు. ఇందులో వ్యక్తిగత స్వార్థం ఏమాత్రం లేదన్నారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచే ఉద్దేశం లేదన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల వరకు బిజు స్వాభిమాన్ మంచ్ తరఫునే కార్యకలాపాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే బిజు స్వాభిమాన్ మంచ్ రాజకీయ పార్టీ ఏమాత్రం కాదని, ఇది కేవలం సమాజ సేవ కోసం ఆవిర్భవించిన సంస్థ మాత్రమేనని తేల్చిచెప్పారు. కొత్త ఏడాదిలో కొత్త రూపకల్పనతో ప్రజల ముందుకు వెళతానన్నారు. జిల్లాలో 11 సమితుల్లో విస్తృతంగా పర్యటించి మద్దతుదారులతో కలిసి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. అందరి అభిప్రాయ సేకరణ తర్వాతే తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
నెక్కంటి బాటలోనే..
నెక్కంటి అడుగుజాడల్లోనే తామంతా నడుస్తామని మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, రాయగడ సమితి వైస్ చైర్మన్ హరప్రసాద్ హెప్రుక, సీనియర్ నాయకుడు బనఘాటి తిరుపతి, కళ్యాణ సింగుపూర్‌కు చెందిన గేదెల శ్రీనివాసరావు తదితరులు పేర్కొన్నారు. ఆయన్నే నమ్ముకుని ఇంత కాలం సేవలందించామని, ఇకపైనే ఆయనతోనే ఉంటామని ముక్తకంఠంతో ప్రకటించారు. నెక్కంటి బీజేడీని వీడిన తర్వాత నలుగురైదుగురు మాత్రమే ఇతర పార్టీల్లో చేరారు తప్ప మిగిలిన వారంతా ఆయన వెంటే ఉన్నారని, ఇకపై అంతా కలిసికట్టుగా పోరాడుతామని స్పష్టం చేశారు.
అందులో వాస్తవం లేదు
తాను బీజేపీలో చేరుతానని గత కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల్లో ఎటువంటి వాస్తవం లేదని నెక్కంటి భాస్కరరావు చెప్పారు. సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు నాయకులు తమతో మంతనాలు చేస్తున్నారని, తాను మాత్రం ఏ నిర్ణయం ఇంతవరకు తీసుకోలేదని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రామచంద్ర ఉలక విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తాను పాల్గొన్నానని, అది వ్యక్తిగత సంబంధాలకే పరిమితం తప్ప ఎటువంటి రాజకీయ కోణం లేదన్నారు. అదే కార్యక్రమానికి రాష్ట్ర గనులు, రవాణా శాఖ మంత్రి బిభూతి జెన్నా కూడా హాజరయ్యారని గుర్తు చేశారు. తామిద్దరం పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఓ సందర్భంలొ మంత్రి నెక్కంటి భాస్కరరావు తమకు అనువాయులన్న మాట వేరేగా వక్రీకరించి వస్తున్న వదంతులను ఆయన కొట్టిపారేశారు. అయితే బీజేపీతో ఒకప్పుడు బీజేడీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అంతమాత్రాన ఆ పార్టీలో చేరుతానని వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. ఏదిఏమైనా తాను ఏ పార్టీలొ చేరుతాననే విషయం కాలమే నిర్ణయిస్తుందని నెక్కంటి స్పష్టం చేశారు.
బిజు స్వాభిమాన్ మంచ్‌తోనే కార్యకలాపాలు


