పాత్రికేయులు సేవామార్గంలో సాగాలి
రాయగడ: పాత్రికేయులు పత్రికా రంగంతో పాటు సేవామార్గంలో ముందుకు సాగాలని సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న అన్నారు. స్థానిక రాయగడ జిల్లా ప్రెస్ యూనియన్ 5వ వార్షికోత్సవాన్ని సదరు సమితి పరిధి కొత్తపేటకు సమీపంలోని మాతృశక్తి సీనియర్ సిటిజన్ భవనంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న మాట్లాడుతూ.. పాత్రికేయులు ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే, వాటిని పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను వెలుగులోకి తీసుకు రావాలని సూచించారు. సంఘం అధ్యక్షుడు సుభాష్ చంద్ర సూర్య మాట్లాడుతూ.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ సంఘం ముందుకెళ్తుందన్నారు. సంఘంలో పాత్రికేయ మిత్రుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈసారి సీనియర్ సిటిజన్ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. సంఘం ముఖ్య సలహాదారుడు శివనారాయణ గౌడో అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ చంద్రకాంత్ మాఝి, జిల్లా అదనపు పౌరసంబంధాల శాఖ అధికారి దేవరాజ్ టక్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిరుపేదలైన 50 మంది వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు.


