సన్నాహాలు
రథయాత్రకు..
2026
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథుని వార్షిక రథ యాత్ర బృహత్తర ఘట్టం. వచ్చే ఏడాది నిర్వహించనున్న స్వామి రథయాత్ర కోసం సన్నాహక ప్రక్రియ సోమ వారం ఆరంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయ అధికార వర్గం (ఎస్‌జేటీఏ) ప్రతినిథి బృందం నయాగఢ్ జిల్లా దసపల్లా శ్రేణి బొదొములొ ప్రాంతానికి బయల్దేరింది. రథాల పర్యవేక్షకుని ఆధ్వర్యంలో ఈ బృందం పవిత్ర రథాల నిర్మాణానికి అవసరమైన కలపను ఖరారు చేసి కోతకు అంగీకారం ధ్రువీకరిస్తుంది. దైవిక అనుమతితో రథాలకు అనుకూలమైన కలపని ధ్రువీకరించి నరికేందుకు ఆమోదం వ్యక్తం చేస్తారు. ప్రాచీన ఆచారాల్లో భాగంగా బొదొములొ అడవి దేవత బొడొ రౌలో అమ్మవారి ఆలయాన్ని ప్రతినిథి బృందం సందర్శిస్తుంది. పూరీ శ్రీ మందిరం నుంచి మూల విరాట్ల నుంచి పొందిన ఆజ్ఞా మాలలు, టెంకాయ, తమలపాకు, సిందూరం, దీపం, నైవేద్యం (నైవేద్యాలు) వంటి పవిత్ర సామగ్రితో మంగళ వారం అడవి దేవతకు ప్రత్యేక పూజాదులు నిర్వహిస్తారు. రథ నిర్మాణాన్ని పర్యవేక్షించే రథ్ అమీన్ లక్ష్మణ్ మహా పాత్రో, కలప నరికివేత ప్రక్రియతో సంబంధం ఉన్న సంప్రదాయ సేవకుల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భోయ్ సర్దార్ రబీ భోయ్ కూడా ఈ ప్రతినిధి బృందంలో ఒకరుగా అనుబంధ కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. మంగళవారం బొడొ రౌలో అడవి దేవత ఆలయంలో పూజ, అర్చనల తర్వాత దేవత అనుమతి పొంది మతపరమైన ఆచారాలతో భగవంతుల రథాల తయారీకి అనుగుణంగా ఉన్న చెట్లని గుర్తించి చెక్కను నరికివేసే అధికారిక ప్రక్రియని ప్రారంభిస్తారు. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్రల 3 రథాల నిర్మాణానికి ఏటా మొత్తం 865 చెక్క దుంగలు అవసరం. గత ఏడాది సేకరించిన దుంగల్లో 47 దుంగలు మిగిలి ఉన్నాయి. వీటిలో సాంప్రదాయకంగా రథ నిర్మాణానికి ఉపయోగించే ఆసన, ధౌర, ఫాసి రకాల కలప దుంగలు ఉన్నాయి. ఈ లెక్కన ఈ ఏడాది రథాల తయారీ కోసం 818 కొత్త దుంగలను సేకరించాల్సి ఉంది. సేకరించిన కలపను సరస్వతి పూజ నాడు పవిత్రం చేస్తారు. రథాల వాస్తవ నిర్మాణం ఏటా అక్షయ తృతీయ నాడు ప్రారంభమవుతుంది. ఇది వార్షిక రథయాత్ర ఆచారాల క్రమంలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.


