బాడీ బిల్డింగ్ పోటీలో రాయగడ యువకుని సత్తా
రాయగడ: కొరాపుట్ జిల్లాలోని జయపురం దసరా మైదానంలో ఆదివారం జరిగిన బాడీ బల్డింగ్ పోటీలో రాయగడకు చెందిన బి.సాయి 65 కిలోల విభాగంలో మొదటి స్థానాన్ని సంపాదించుకుని తన సత్తా చాటుకుని మిస్టర ఒన్ మెడల్‌ని గెలుచుకున్నాడు. ఈ పోటీల్లో రాయగడ, కొరాపుట్ తదితర ప్రాంతాల నుంచి 80 మంది పాల్గొన్నారు. జయపురంలోని మధు జిమ్ మేనేజర్ జితు ఖర ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ముఖ్యఅతిథిగా కొరాపుట్ ఎంఎల్‌ఏ రఘురాం మచ్చ, గౌరవ అతిథిగా బీజేడీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రవినారాయణ నందో, జయపురం మున్సిపల్ చైర్మన్ నరి మహాంతి, న్యాయవాది ఆరతీ మహాంతి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
శ్రీమందిరం ధ్వజ బంధనం వేళలు మార్పు
భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథ ఆలయం ధ్వజ బంధనం ఆచార సమయాన్ని నూతన సంవత్సర రోజున మధ్యాహ్నం మూడ గంటలలోపు ముగించేలా అధికారులు సవరణ చేశారు. శతాబ్దాల నాటి ఆలయ సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా దర్శనం సజావుగా జరిగేలా ధ్వజ బంధనం వేళలు సర్దుబాటు చేసినట్లు వివరించారు. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని పూరీలోని జగన్నాథ ఆలయం పాలకవర్గం ధ్వజ బంధనం ఆచార సమయాన్ని సవరించింది. సాధారణంగా నిత్యం సాయంత్రం ఐదు గంటలకు జరిగే ఈ ఆచారం తాజా సవరణ మేరకు మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. నూతన సంవత్సర వేడుకల కోసం ఆలయాన్ని సందర్శించే భారీ జనసమూహాన్ని పరిగణనలోకి తీసుకుని సమయాల్లో మార్పు అమలు చేస్తారు. శ్రీ జగన్నాథ ఆలయం ప్రధాన పాలన అధికారి సీఏవో డాక్టర్ అరవింద కుమార్ పాఢి మాట్లాడుతూ.. దర్శనం సజావుగా నిర్వహించాలని, రద్దీ నివారణ కోసం ఈ మార్పు చేసినట్టు పేర్కొన్నారు. ఆలయ సంప్రదాయ ఆచారాలు, శాంతిభద్రతలకు ఏమాత్రం భంగం కలిగించకుండా ధ్వజ బంధనం సర్దుబాటు కొనసాగాలని సీఏవో ఆదేశించారు.
బైక్ ప్రమాదంలో
యువకుడు మృతి
మల్కన్‌గిరి: చెట్టును ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన సంఘటనలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు పోలీసుస్టేషన్ పరిధిలోని ఉరుబాలి గ్రామం వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకోగా యువకుడు రాజేజ్ రాబా (19) మృతి చెందాడు. యువకుడు చెట్టును ఢీకొని గాయపడిన సంఘటనను చూసిన స్థానికులు అతన్ని మోటు ఆరోగ్య కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామును మృతి చెందాడు.. ఉరుబాలి గ్రామానికి చెందిన రాబా సమీపంలోని ఎజ్‌పోఢా గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కలిమెల ఐఐసీ ముకుందో మేల్కా కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం కోసం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు.


