ఆదివాసీల అభ్యున్నతే ధ్యేయం
● రాష్ట్ర ఖనిజ, గనుల శాఖ మంత్రి బిభూతి జెన్న
రాయగడ: ఆదివాసీల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఖనిజ, గనుల శాఖల మంత్రి భిభూతి జెన్న అన్నారు. స్థానిక గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో కొనసాగుతున్న చొయితీ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీలను మరిస్తే వారు ప్రభుత్వాన్ని నిలదీస్తారని మంత్రి జెన్న చమత్కరించారు. భిన్న సంస్కృతులు గల మన రాష్ట్రంలో అందరికి సమాన ప్రాధాన్యత కల్పించేందుకు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. జిల్లాలో అపారమైన ఖనిజ సంపదలు ఉన్న నేపథ్యంలో డిస్టెట్ మినరల్ ఫండ్ (డిఎంసి) ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో భాగంగా ఈ ప్రాంతంలో గల పర్యాటక స్థలాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. చొయితీ ఉత్సవాల్లో రాయగడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇందిరా డ్యాన్స్ అకాడమీ ద్వారా నిర్వహించిన కూచిపూడి నృత్యాలు, డాబుగాం (గంజాం) నుంచి వచ్చిన శైలొడి థింసా, రామనగుడ నుంచి వచ్చిన ఝరిలింగగుడ మిరిహా నృత్యం, మా మజ్జిగౌరి డ్యాన్స్ గ్రూప్ ద్వారా కొరాపుటియా థింసా, కళ్యాణసింగుపూర్ నుంచి వచ్చిన ఆదివాసీ కుయి నృత్యం, జంఝావతి కళాపరిషత్ ద్వారా థింసా, గాయత్రీ కళా సంగటన్ ద్వారా ఆదివాసీ సంప్రదాయ నృత్యం ప్రేక్షకులను అలరించాయి. అదేవిధంగా రాధా గొవిందుని నృత్యం ప్రత్యేకంగా ప్రజల ఆదరణ పొందింది. ఓలీవుడ్ సినీ నేపథ్య గాయకులు బిష్ణు మోహన్ కబి, నవ్యా జైతీ లు తెలుగు, ఒడియా, ఫోక్ గీతాలను ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
ఆదివాసీల అభ్యున్నతే ధ్యేయం


