శ్రీ మందిరం పాలక మండలి తీర్మానాలు
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2025
భువనేశ్వర్: శ్రీ జగన్నాథ ఆలయ పాలక మండలి శుక్రవారం రత్న భాండాగారంలో భద్రపరిచిన అమూల్య ఆభరణాలు, విలువైన వస్తువుల జాబితా, ధ్రువీకరణను దశలవారీగా ప్రారంభించాలని నిర్ణయించింది. పూరీ గజపతి మహా రాజా దివ్యసింఘ దేవ్ అధ్యక్షతన దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం కీలక పరిణామంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రత్న భాండాగారం ఆభరణాల డిజిటల్ రికార్డు ప్రక్రియ చేపడతారు. వచ్చే ఏడాది అక్షయ తృతీయకు ముందు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పాలక మండలి లక్ష్యంగా నిర్ధారించింది.
శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు (సీఏఓ) ప్రత్యక్ష పర్యవేక్షణలో కమిటీ సభ్యులు రత్న సంపద జాబితా రూపకల్పనకు నిర్ధారిత కార్యాచరణ ప్రణాళిక (ఎస్‌ఓపీ జారీ చేయబడుతుందని పాలక మండలి ప్రకటించింది.
నాట్య మండపం వద్ద దర్శన వ్యవస్థలో మార్పులతో సహా ఆలయ నిర్వహణ అనేక అంశాలను పాలక మండలి సమీక్షించింది. వీఐపీ, వీవీఐపీ ప్రోటోకాల్ సందర్శనల కోసం ప్రత్యేక ఎస్‌ఓపీ రూపొందించాలని నిర్ణయించారు. గుండిచా ఆలయం త్వరలో భక్తుల కోసం తెరుస్తారు. శ్రీ మందిరం అధికార వర్గం గుండిచా మందిరం నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. శ్రీ మందిరం భూముల సంరక్షణ, భద్రత వ్యవహారాలు బలోపేతం చేయడానికి శ్రీ జగన్నాథ ఆలయ చట్టంలో సవరణలు చేపడతారు. భారతదేశం, విదేశాలలో ఒకే రోజు స్నాన యాత్రను నిర్వహించాలనే ఇస్కాన్ ఒప్పందంపై పాలక మండలి చర్చించింది. నెలవారీ ఫించన్ రూ. 4,000 నుంచి రూ. 5,000కు, సేవాయతుల కుమార్తెల వివాహ సహాయం రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు, ఉపనయనం సహాయం రూ. 20,000 నుంచి రూ. 50,000కు పెంచడం వంటి సేవకుల సంక్షేమ చర్యల ప్రతిపాదనలు ఆమోదించారు. ఈ సవరించిన ప్రయోజనాలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తాయి. ఈ సందర్భంగా జగన్నాథ్ వల్లభ్, రఘునందన్ లైబ్రరీ మరియు గుండిచా ఆలయాల అభివృద్ధి పనులను సమీక్షించారు.
స్థానికులకు ప్రత్యేక సౌలభ్యం
ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా పూరీ నివాసితులకు సజావుగా దర్శనం కల్పించడానికి ప్రత్యేక సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉపసంఘం పలు కోణాల్లో పరిశీలించి కొత్త ఎస్‌ఓపీని రూపొందిస్తుందని ఎస్‌జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ డాక్టరు అరవింద కుమార్ పాఢి తెలిపారు.
దశల వారీగా జగన్నాథ రత్న సంపద డిజిటల్ డాక్యుమెంటేషన్
కొత్త సంవత్సరం నుంచి సేవాయత్‌ల సంక్షేమ ప్రయోజనాలు పెంపుదల
వీఐపీ ప్రోటోకాల్, దర్శన వ్యవస్థ, పూరీ నివాసితుల ఆలయ ప్రవేశానికి ఎస్‌ఓపీ జారీ
శ్రీ మందిరం పాలక మండలి తీర్మానాలు


