ఔషధ మొక్కల పెంపకానికి అంగీకారం
జయపురం: రాష్ట్రంలో ఔషధ మొక్కలను విస్తృతంగా పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రైతులను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టేందుకు జయపురానికి చెందిన ఎం.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ సెంటర్, ఒడిశా రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర ఔషధీయ పరిషత్లు సంయుక్తంగా ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయించాయి. ఈ ప్రాజెక్టు విజయవంతంగా నిర్వహించేందుకు ఎం.ఎస్.స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్, ఒడిశా ప్రభుత్వ విభాగాల మధ్య అంగీకారం కుదిరింది. ఈ సందర్భంగా రిసెర్చ్ ఫౌండేషన్ విభాగ డైరెక్టర్ ప్రశాంత పొరిడ, అటవీ విభాగ మంత్రి గణేష్ రామసింగ్ ఖుంటియ మధ్య ఎంవోయూ కుదిరింది. ఆ ఒప్పందంపై గురువారం ఒప్పందం కుదిరిన సమయంలో అదనపు ప్రధాన కార్యదర్శి సత్యబ్రత సాహు, సీనియర్ అధికారి వి.కార్తీక్, సురేష్ పంత్ ఉన్నారు.భువనేశ్వర్ రాష్ట్ర లోక్‌సేవా భవణ్ కన్వెన్సన్ కేంద్రంలో ఔషధ మొక్కల పంటల విస్తరణపై జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించారు. సెమినార్‌లో వెదురు, ఔషధ సంబంధిత మొక్కల వ్యవసాయం విస్తృత పరచి వాటిని సద్వినియోగంపై చర్చించారు. రాష్ట్రంలోని కొరాపుట్, కంధమాల్, బరగడ్, కేంజూర్, మూర్‌భంజ్ జిల్లాలను యూనిట్‌గా తీసుకొని ఔషధ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించారు.


