12 ప్రతిపాదనలకు ఆమోదం
భువనేశ్వర్: రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం నాడు 2 విభాగాల నుంచి 12 ముఖ్యమైన ప్రతిపాదనలను ఆమోదించింది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మంత్రివర్గం సమావేశం తర్వాత ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా మీడియాకు మంత్రి వర్గం ఆమోదించిన ప్రతిపాదనలు తెలియజేశారు. తాజా నిర్ణయం ప్రకారం యూనిఫామ్ సర్వీస్ పర్సనల్ సెలెక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ కమిషన్ పోలీసు, ఎకై ్సజ్, అటవీ శాఖల నియామకాలు చేపడుతుంది. ఈ కమిషన్‌లో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. ఇది నియామక ప్రక్రియలో పారదర్శకతను తీసుకువస్తుందని మంత్రి వర్గం అభిప్రాయపడింది. లఘు ఖనిజాల కేటాయింపు కోసం ప్రస్తుత వేలం ప్రక్రియ స్థానంలో ఈ–లాటరీ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. లఘు ఖనిజాల ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక జిల్లాలో గరిష్టంగా 3 లఘు ఖనిజాలను మరియు రాష్ట్ర వ్యాప్తంగా 5 లఘు ఖనిజాలను కొనుగోలు చేయవచ్చు. ఈ సవరణలు ఆఫ్–సీజన్ సమయంలో స్టాక్‌యార్డులలో లఘు ఖనిజాలను నిల్వ చేయడానికి కూడా అనుమతిస్తారు. లఘు ఖనిజాల అక్రమ రవాణాను నిరోధించడానికి ప్రభుత్వం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని యోచిస్తోంది.


