
చేతబడి నెపంతో వృద్ధుడి దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని కారుబాయి పంచాయతీ పరిధిలో గల సనొసిగురు గ్రామంలో ఒక వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. చేతబడి చేస్తున్నాడన్న నెపంతో గ్రామంలో కొందరు యువకులు అతడిని హత్య చేశారు. మృతుడిని నారాయణ మండంగి (60)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న శెశిఖల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నాడు చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... సన్నొసిగురు గ్రామంలో నివసిస్తున్న నారాయణ మండంగి అనే వృద్ధుడు గత కొద్ది కాలంగా చేతబడి చేస్తున్నట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఇంటిలో ఒక్కడే ఉన్నాడని తెలుసుకున్న కొందరు గ్రామానికి చెందిన యువకులు ఇంటిలోకి చొరబడి నారాయణను బయటకు లాక్కుంటూ వచ్చి మరణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధుడు మృతి చెందాడు. ఈ మేరకు బాధిత కుటుంబీకులు శెశిఖాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.