
విచ్ఛేదనం ప్రారంభం
పూరీలో యాత్ర రథాల..
● అధునాతన గోదాం సిద్ధం
భువనేశ్వర్: పూరీలో శుక్రవారం నుంచి స్వామి యాత్ర రథాల విచ్ఛేదనం పనులు ప్రారంభమయ్యాయి. తయారీ ప్రక్రియలో అమరిక క్రమంలో విచ్ఛేదన ప్రక్రియలో 3 రథాల్లో భాగాల్ని జాగ్రత్తగా విడదీస్తారు. ఈ విడి భాగాల్లో ప్రముఖమైన వాటిని ఔత్సాహికులకు వేలం ద్వారా విక్రయిస్తారు. ఈ ఏడాది నుంచి అత్యంత పవిత్రంగా భావించే రథాల భాగాల్ని ప్రత్యేక గోదాంలో భద్రపరచనున్నారు. చివరగా మిగిలిన కలప చెక్కల్ని శ్రీ మందిరంలో ప్రసాదాల తయారీ వంట చెరుకుగా వినియోగిస్తారు. ఇలా రథాల్లో ఏ ఒక్క చెక్క ముక్కని వృథా చేయకుండా సర్వం స్వామి సేవలో విలీనం చేయడం అత్యద్భుత సంస్కృతి.
శ్రీ మందిరం అధికార వర్గాల ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి రథాల భాగాల్ని విడదీసే పనులు ప్రారంభించాయి. సర్దార్ భొయి సేవకుని ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి. సంప్రదాయం ప్రకారం తొలుత దేవీ సుభద్ర రథం దర్ప దళనం భాగాల్ని విడదీస్తున్నారు. తర్వాత బలభద్ర స్వామి తాళ ధ్వజం చివరగా శ్రీ జగన్నాథుని నందిఘోష్ రథాన్ని విడదీయడం ఆచారం. రథ చక్రాలు, ప్రభలు, తలుపు ఫ్రేములు, పార్శ్వ స్తంభాల భాగాల్ని శ్రీ మందిరం పాలక వర్గం వేలం వేస్తుంది. ఈ మేరకు ఔత్సాహిక వర్గాలకు అనుబంధ సమాచారం ముందస్తుగా ప్రసారం చేసింది.
రథాల విచ్ఛేదన పవిత్ర కార్యం
అత్యంత నియమ నిష్టలతో జగతి నాథుని యాత్ర కోసం నింగిని తాకే 3 భారీ రథాలు ఏటా తయారు చేస్తారు. ఈ మేరకు అడుగడుగునా ఆచార సంప్రదాయాలతో కూడిన పూజాదులు ఇతరేతర పవిత్ర కార్యకలాపాలతో రథాల తయారీ పూర్తి చేస్తారు. స్వామి ఆశీనుడై యాత్ర చేయడంతో ఈ రథాలు మరింత పవిత్రత సంతరించుకుంటాయి. వాటి విచ్ఛేదన కూడ అంతే పవిత్రంగా నిర్వహించడం జరుగుతుందని మరో మరో సేవాయత్ తెలిపారు. ముందుగా ఆచారం ప్రకారం ప్రత్యేక పూజాదులతో రథాల భాగాల విడదీత ప్రారంభించడం జరుగుతుందన్నారు. రథాలను పై నుండి విచ్ఛేదనం చేస్తారు. ఒక్కో రథం భాగాలుగా విడదీయడంలో దాదాపు 10 మంది సేవాయత్‌లు పాల్గొంటారు.

విచ్ఛేదనం ప్రారంభం