
‘ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు తక్షణమే తొలగించాలి’
భువనేశ్వర్: బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అత్యున్నత రాజకీయ నాయకులలో ఒకరుగా కొనసాగుతున్నారు. ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన సందర్భంగా అతని సన్నిహితులు వీకే పాండ్యన్, అతని భార్యపై ఫేస్‌బుక్‌లో కొన్ని అత్యంత అవమానకరమైన, అసభ్యకరమైన పోస్ట్‌లను ప్రసారం చేశారు. దీనిపై నవీన్‌పట్నాయిక్ సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. మెటాతో సంప్రదించి తక్షణమే పోస్టులు తొలగించడంతో పాటు వాటిని ఎవరు వేశారో వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బిజూ జనతా దళ్ ఐటీ, సోషల్ మీడియా సెల్ ఇంచార్జి, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ అమర్ పట్నాయక్ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌కు ఫిర్యాదును దాఖలు చేశారు. బాధ్యులైన వారిని గుర్తించి అరెస్టు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి చర్య తీసుకోకపోతే, ఈ పోస్టులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, మోహన్ చరణ్ మాఝీ ప్రభుత్వం ఆదేశాల మేరకు నకిలీ హ్యాండిళ్ల నుంచి ఈ పోస్టులు విడుదలై ప్రసారం చేసినట్లు విశ్వసించాల్సి వస్తుందన్నారు.
పద్మపూర్‌ను ఎన్‌ఏసీగా గుర్తించాలి
రాయగడ: జిల్లాలోని పద్మపూర్‌ను ఎన్‌ఏసీగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో నేతృత్వంలో సబ్ కలెక్టర్ దుదుల్ అభిషేక్ దిలీప్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పద్మపూర్ సమితిని ఎన్‌ఏసీగా గుర్తించేందుకు గత బీజేడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాబితాలో పద్మపూర్‌ను విస్మరించడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టిసారించి పద్మపూర్‌ను ఎన్‌ఏసీగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాజీవ్ లోచన్ సాహు, రమేష్ చంద్ర పండ, ఉదయ్ సాహు, అనిల్ కుమార్ చౌదరి, జగన్నాథ పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం
కొరాపుట్: ఇంద్రావతి రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తామని బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరి శంకర్ మజ్జి ప్రకటించారు. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా తెంతులకుంటి సమితి ఖాతీగుడ సమీపంలో అప్పర్ ఇంద్రావతి హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్‌కి అనుసంధానం ఉన్న రిజర్వాయర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. అక్కడ ఎకో టూరిజం ఏర్పాటుకి సాధ్యాసాధ్యాలు గురించి అధికారులతో చర్చించారు. వీలైనంత త్వరలో నివేదికలు సమర్పించాలని సూచించారు. ఆయనతో పాటు కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, తెంతుకుంటి బీడీవో మనోజ్ కుమార్ పాణిగ్రాహి, బీజేపీ నాయకులు సురేష్ శాస్త్రి, దేవదాస్ మహంకుడోలు ఉన్నారు.
బాలుని మృతదేహం లభ్యం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పుటాసింగి పోలీస్‌స్టేషన్ పరిధి టిటిమిరి పంచాయతీ జంగపూర్‌ముండా గ్రామ సమీపంలోని మహేంద్రతనయ నదిలో బాలుడి మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది గురువారం స్వాధీనం చేసుకున్నారు. మృతుడు టిటిమిరి గ్రామానికి చెందిన జాస్మిన్ సొబొరొ(6)గా గుర్తించారు. బుధవారం బాలుడి తల్లి లయని, తండ్రి పితసొబొరొలు వ్యవసాయ పనులకు వెళ్లగా జాస్మిన్ తన స్నేహితులతో కలిసి నదికి స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి బాలుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

‘ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు తక్షణమే తొలగించాలి’

‘ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు తక్షణమే తొలగించాలి’