
ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ చేరాలి
రాయగడ: ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ప్రజలందరికీ చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ ఎస్.ఎన్.గిరీష్ అన్నారు. గత మూడు రోజులుగా జిల్లాలోని బిసంకటక్, గుణుపూర్, పద్మపూర్ తదితర ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. స్థానిక డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదాల్ అభిషేక్ దిల్లిప్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ తదితరులు పాల్గొని వివిధ పథకాలపై సమీక్షించారు. ఆరోగ్యశాఖకు సంబంధించి జిల్లాలో ప్రజలకు అందుతున్న వైద్య సౌకర్యాల గురించి ఆరా తీశారు. గొపబంధు జన ఆరోగ్య పథకం, ఆయుస్మాన్ భారత్, ప్రధానమంత్రి జనారోగ్య పథకాల గురించి సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం గ్రామీణ అభివృద్ధిశాఖ ద్వారా జిల్లాలో నిర్మిస్తున్న వంతెనల పనితీరు, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా, శిశు సంరక్షణకు సంబంధించి చేపడుతున్న కార్యక్రమాలు గురించి వైద్యశాఖ అధికారులను అడిగారు. ఆదివాసీ, హరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న హాస్టళ్ల పనితీరు, విద్యార్థుల ఆరోగ్య భద్రత, వారికి కల్పిస్తున్న సౌకర్యాల గురించి చర్చించారు.