
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
రాయగడ: జిల్లాలో ఇటీవల పెరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి సంబంధితశాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం డీఆర్‌డీఏ సమావేశంలో ఈ మేరకు జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, డీఎఫ్‌ఓ అన్నా సాహేబ్ అహోలే, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుధుల్ అభిషేక్ దిల్లిప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కులకర్ణి అధికారులతో మాట్లాడుతూ గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జిల్లాలో పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా అధికారులు విస్తృతంగా దాడులను నిర్వహించాలన్నారు. ముఖ్యంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా సాగవుతున్న గంజాయిని రూపుమాపాలని పిలుపునిచ్చారు. గంజాయి సాగు వంటి సంఘ విద్రొహక చర్యలు చేపడితే చట్టరీత్యా నేరమన్న విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గల ప్రజల ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి అవగాహన కల్పించారు. వారికి జీవనోపాధికి మార్గం సుగమమం చేయగలిగితే గంజాయి వంటి సాగుకు వారు దూరంగా ఉంటారని అభిప్రాయపడ్డారు.