
ముచ్చటగా మూడు
అయోధ్య, హైదరాబాద్, సూరత్‌లో కొత్త ఒడిశా భవనాలకు ప్రతిపాదన
ఢిల్లీలో ఒడిశా భవన నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్ష
భువనేశ్వర్ :
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు చోట్ల ఒడిశా భవనాలను నిర్మించాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదిత ప్రాంతాల్లో అయోధ్య, హైదరాబాద్, సూరత్ చోటుచేసుకున్నాయి. న్యూఢిల్లీ చాణక్యపురి ప్రాంతంలో కొనసాగుతున్న ఒడిశా భవన్ నిర్మాణం పనులు, పురోగతిని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి బుధవారం స్థానిక లోక్ సేవా భవన్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా వారసత్వాన్ని ప్రతిబింబించేలా కొత్త భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటిలో సంప్రదాయ రాతి కళా నైపుణ్యం, సంబల్‌పురి ఇకత్, ఒడిశా సాంస్కృతిక మూలాంశాల్ని ప్రతిబింబించే రీతితో నిర్మాణ ప్రణాళిక ఖరారు చేశారు. ఈ భవన నిర్మాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
●సువిశాల 4,761 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 7 అంతస్తుల (జి+6)తో న్యూ ఢిల్లీలో ఒడిశా భవనం నిర్మాణం జరుగుతోంది. ఈ భవన సముదాయంలో 45 గదులు, సూట్‌లతో పాటు ఆధునిక సమావేశ హాలు కలిగి ఉంటుంది.
● దేశంలో ప్రముఖ ప్రాంతాల్లో ఒడిశా భవనాల నిర్మాణం, అభివృద్ధి, విస్తరణ పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. ముంబై ఒడిశా భవన్‌లో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్నందున, అక్కడ మరిన్ని గదులు పెంచాలని యోచిస్తున్నారు. కోల్‌కతాలో ఒడిశా భవనం పునరుద్ధరణ, ఆధునీకరణ చేపట్టాలని అధికారులకు తెలిపారు.
● అయోధ్య, హైదరాబాద్, సూరత్‌లలో కొత్త ఒడిశా భవనాలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆయా ప్రాంతాలకు పలువురు ఒడియా ప్రజలు తీర్థ యాత్ర ఇతరేతర వ్యవహారాల కోసం తరచు సందర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం ఆ ప్రాంతాల్లో ఒడిశా భవనాల నిర్మాణం అవసరం పెరుగుతుందన్నారు.

ముచ్చటగా మూడు