
పోలవరం ప్రాజెక్టుతో మల్కన్‌గిరి మునక
పనులు ఆపాల్సిందే
సీడబ్ల్యూసీకి బీజేడీ వినతి
భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కారణంగా మల్కన్‌గిరిలోని అనేక ప్రాంతాలు మునిగిపోతాయని, ఈ ప్రాజెక్టు తీర ప్రాంతం గిరిజనుల జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని బిజూ జనతా దళ్ బృందం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) దృష్టికి తీసుకెళ్లింది. పోలవరం ప్రాజెక్టుతో ఒడిశాకు తలెత్తే సమస్యలకు సంబంధించి సమగ్ర వివరాలతో కూడిన వినతిపత్రం సమర్పించింది. ఈ దిశలో తక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. తగిన సంప్రదింపులు లేకుండా సవరించిన వరద ముంపు ప్రామాణికలతో పొరుగు రాష్ట్రం యథేచ్ఛగా పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగిస్తోందని విపక్ష బీజేడీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తాజా జల సంబంధ అంచనాలు, సమగ్ర వాటాదారుల సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఆంధ్ర ప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని విన్నవించింది. మల్కన్‌గిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలను బ్యాక్ వాటర్ ప్రభావాలు ముంచెత్తి తీర ప్రాంతంలో గిరిజన వర్గాల్ని నిరాశ్రయులుగా మార్చుతుందని చెప్పింది. 2024 నుంచి పదే పదే చేస్తున్న అభ్యర్థనల్ని పెడ చెవిన పెట్టి భద్రత, పునరావాసం, డిజైన్ సమస్యలను పరిష్కరించకుండా పొరుగు రాష్ట్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనుల్ని నిరవధికంగా కొసాగించడం తగదన్నారు. అత్యవసర ప్రజా ప్రయోజనానికి సంబంధించిన విషయంగా పరిగణించి నిబంధనల ఉల్లంఘనతో కొనసాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు పని నిలిపివేతకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు సంబంధిత అన్ని వాటాదారుల రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి తాజా బ్యాక్ వాటర్ అధ్యయనం చేపట్టాలని ప్రతినిథి బృందం అభ్యర్థించింది.
వరద అంచనాల్లో మార్పులతో ముప్పు..
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వరద పొంగు అంచనాల రూపకల్పనలో తరచు చోటు చేసుకుంటున్న మార్పులతో ముంపు ముప్పు తీవ్రతరం అవుతుందని వివరించారు. 1970లో 36 లక్షల క్యూసెక్కుల డిజైన్ వరదకు అనుమతిచ్చిన ఈ ప్రాజెక్టును 2006 లో 50 లక్షల క్యూసెక్కులకు సవరించారు. ఎగువ పరీవాహక (అప్ స్ట్రీమ్) రాష్ట్రాలతో తగిన సంప్రదింపులు, తాజా బ్యాక్ వాటర్ విశ్లేషణ లేకుండా ఈ మార్పులు చేపట్టడం పట్ల బిజూ జనతా దళ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గతంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ చర్యలు ఒడిశాలో గరిష్ట బ్యాక్ వాటర్ స్థాయి ఆర్.ఎల్. 174.22 అడుగులను 36 లక్షల క్యూసెక్కులుగా పరిగణించినట్లు బీజేడీ ప్రతినిథి బృందం కేంద్ర జల సంఘానికి గుర్తు చేసింది.
బీజేడీ వాదన..
2009 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధ్యయనం, 2019 ఐఐటీ రూర్కీ అంచనాతో సహా తదుపరి నిర్వహించిన పరిశీలనలో 50 లక్షల క్యూసెక్కుల వద్ద ఆర్. ఎల్. 216 అడుగులు, 58 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద (పీఎంఎఫ్) వద్ద ఆర్.ఎల్, 232.28 అడుగులుగా గుర్తించాయి. ఈ గణాంకాలు నిజమైతే మల్కన్‌గిరి ముంపు తథ్యమనే సంకేతాలు బలపడతాయని బీజేడీ వాదిస్తోంది.
బీజేడీ విన్నపం..
సీడబ్ల్యూసీ నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంప్రదింపులను బిజూ జనతా దళ్ ప్రతిపాదించింది. ఒడిశా నదుల కోసం ఎగువ పరీవాహక బ్యాక్ వాటర్ గణనలు ఎప్పుడైనా నిర్వహించబడ్డాయా లేదా అనే దానిపై నిర్ధారణ, గరిష్ట వరద సంఘటనలకు స్పిల్‌వే డిశ్చార్జ్ సామర్థ్యం, జలాశయం నిర్వహణ నియమాలపై స్పష్టత కోరింది. ఈ దిశలో జల సంఘం నికరమైన అభిప్రాయానికి వచ్చేంత వరకు 50 లక్షల క్యూసెక్ వరదల అంచనా ప్రామాణికంతో కొనసాగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల నిలిపివేతకు ఆదేశాలు జారీ చేయాలని విన్నవించింది.