
వార్షిక ఫీజులు పెంపు
పర్లాకిమిడి: ఒడిశాలో 2025–26 విద్యాసంవంత్సరంలో అన్ని ప్రైవేటు మెడికల్ కళాశాలలో వార్షిక ఫీజులు తప్పనిసరిగా పెంచాల్సి వచ్చిందని ఒడిషా ప్రైవేటు మెడికల్ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. బుధవారం భువనేశ్వర్‌లో హైటెక్ మెడికల్ కళాశాల కాన్ఫరెన్సు హాలులో వారు మాట్లాడుతూ ప్రతి మూడేళ్లకు ప్రైవేటు మెడికల్, డెంటల్ కోర్సుల ఫీజులు పెంచాల్సి ఉన్నా ఏడేళ్ళుగా ఒడిషాలో మెడికల్ కోర్సుల ఫీజులు రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదన్నారు. రోగుల ఆరోగ్య సేవలు, చికిత్సా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్న దృష్ట్యా కళాశాలల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఒడిషా ప్రైవేటు, ఇంజినీరింగ్ కళాశాలల చట్టం 2007 ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లో కోర్సుల ఫీజుల పెంపునకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రికి సిఫారసు చేసినట్లు తెలిపారు. సమావేశంలో హైటెక్ మెడికల్ కళాశాలల అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ గోపేశ్వర్ ఆచార్య, ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జ్యోతిర్మయి పండా పాల్గోన్నారు.