
తాగునీటి సమస్య పరిష్కరించాలని వినతి
రాయగడ: రాష్ట్ర నీటి పారుదల, పంచాయతీరాజ్ శాఖల కార్యదర్శి, కమిషనర్ ఎస్.ఎన్.గిరీష్‌కు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ లిమామెడా గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ పరిధి పద్మపూర్, గుణుపూర్‌లలో సోమవారం పర్యటించిన ఆయనకు గ్రామస్తులు కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. లిమామోడ గ్రామంలో గత కొన్నేళ్లుగా తాగునీటి సమస్య వేధిస్తోందని వివరించారు. గుణుపూర్‌లోని మెగా తాగునీటి ప్రాజెక్టు ద్వారా తమ గ్రామానికి నీరు అందేలా చూడాలని కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్ గిరీష్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామానికి భవిష్యత్‌లో తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.