
కొనసాగుతున్న రెవెన్యూ ఉద్యోగుల సమ్మె
పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్ వద్ద ఒడిశా రెవెన్యూ ఉద్యోగుల సంఘం సమ్మె మంగళవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. దీంతో కలెక్టరేట్‌కు వచ్చిన ప్రజలు తమ పనులు జరగకపోవడంతో వెనుదిరుగుతున్నారు. రెవెన్యూ మినిస్టీరియల్ ఉద్యోగులకు ప్రారంభ మూల వేతనం పెంచాలని, అలాగే పాత పింఛన్ విధానం అమలు చేయాలని కోరుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చర్చలకు రాలేదు. సమ్మె కాలంలో జీతాలు ఆపివేస్తామని, ఎస్మా చట్టం ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యదర్శి సంతును మిశ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హెచ్చరికలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఆందోళనలో ఉపాధ్యక్షుడు సోరెన్ శంకర్‌లాల్, రెవెన్యూ అమలా సంఘం అధ్యక్షుడు జుధిస్టర్ రణసింగ్ తదితరులు పాల్గొన్నారు.