
గురజాడ సాహిత్య సంపద, స్మారక భవనాన్ని కాపాడాలి
విజయనగరం గంటస్తంభం: మహాకవి గురజాడ అప్పారావు స్మారక భవనం గురించి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ పట్టకపోవడం శోచనీయమని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. గురజాడ రచనలను భద్రపరచాల్సిన ఆర్కియాలజీ విభాగం, రాష్ట్ర టూరిజం శాఖ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా గురజాడ గృహాన్ని, గురజాడ సాహిత్యాన్ని కాపాడటంలో పూర్తిగా విఫలమవుతున్నాన్నారు. గురజాడ గృహాంలో గురజాడకి శనివారం ఘన నివాళులు అర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గురజాడ అప్పారావు ఇంటిలో తాగుబోతు హాల్ చల్ చేసి, సాహిత్య సంపాదని, వస్తువులను చిందరవందర చేసినా అధికార పార్టీకి చెందిన నాయకులు ఎవరూ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత, విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లాలోని ఎమ్మెల్యేలుగాని గురజాడ ఇంటిని సందర్మించడానికి కూడా తీరిక కల్పించుకోలేని పరిస్థితిలో ఉండడం పట్ల ఆయన మండిపడ్డారు. తెలుగు సాహిత్యాన్ని ప్రపంచం నలుమూలలకి పంపి సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తికి మన నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గురజాడ అప్పారావు సాహిత్య సంపదకు, గురజాడ స్మారక భవనానికి తగిన రక్షణ కల్పించాలని భీశెట్టి కోరారు. పౌర వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు పిడకల ప్రభాకరరావు, ప్రధాన కార్యదర్మి జలంత్రి రామచంద్ర రాజు, సహాయ కార్యదర్మి తుమ్మగంటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.