
బాక్సింగ్ భార్గవ్
● జూనియర్ ఇండియన్ బాక్సింగ్ టోర్నీలో కాంస్య పతకం సాధించిన సత్యభార్గవ్
● ఇండియన్ కోచింగ్ క్యాంపునకు ఎంపిక
● భారత జట్టుకు ఎంపిక కావడమే లక్ష్యంగా సాధన
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు యువ బాక్సింగ్ సంచలనం గంధం సత్యభార్గవ్ ఆకాశమే హద్దుగా రాణిస్తున్నాడు. ఇప్పటికే అనేక టోర్నమెంట్లలో సత్తాచాటిన భార్గవ్ ప్రతిష్టాత్మక ఆలిండియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకంతో మెరిశాడు. దీంతో హర్యానాలోని రోతక్ వేదికగా ఆగస్ట్ 2 నుంచి 15వ తేదీ వరకు జరిగిన ఇండియన్ కోచింగ్ క్యాంప్‌కు ఎంపికయ్యాడు. రెండు వారాలపాటు శిక్షణ పాఠాలు నేర్చుకున్న భార్గవ్ క్యాంప్ ముగించుకుని జిల్లాకు పయనమయ్యాడు. ఇండియన్ బాక్సింగ్ జట్టుకు ఎంపిక కావడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. బలగలోని జంగమ వీధిలో నివాసముంటున్న భార్గవ్ తండ్రి గంధం వీరకుమార్ పురోహితుడు, తల్లి పుష్పలత గృహిణి. పురోహితమే వీరి జీవనాధారం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇద్దరు పిల్లలు ఢిల్లేశ్వర్, భార్గవ్ ఆటలపై ఆసక్తి పెంచుకున్నారు. ఇద్దరూ డీఎస్‌ఏ బాక్సింగ్ కోచ్ ఉమామహేశ్వరరావు వద్ద శిక్షణ పొంది జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు.
ఇండియన్ క్యాంప్‌కు ఎంపిక..
భార్గవ్ 2019లో బాక్సింగ్‌లో ప్రవేశం పొందాడు. కోవిడ్‌తో టోర్నీలు లేక.. ప్రాక్టీసుకే పరిమితమయ్యాడు. 2022లో విశాఖపట్నంలో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌లో రజత పతకం, ఆ తర్వాత వరుసగా 2023 రాజమండ్రిలో, 2024లో విశాఖపట్నంలో జరిగిన స్టేట్‌మీట్‌లో బంగారు పతకాలు సాధించాడు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లోఅద్భుతంగా రాణించి బంగారు పతకంతో మెరిశాడు. బాక్సింగ్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో హర్యానాలోని రోతక్‌లో జూలై 18 నుంచి 24 వరకు జరిగిన ప్రతిష్టాత్మక 6వ జూనియర్ నేషనల్స్ బాక్సింగ్ మీట్‌లో 80–85 కేజీల విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు. ఫైనల్ బెర్త్ కోల్పోయినా సెలక్టర్లను ఆకర్షించి ఇండియన్ క్యాంప్‌కు ఎంపికయ్యాడు. హర్యానాలోని రోతక్ వేదికగా శిక్షణ ముగించుకుని జిల్లాకు తిరుగుముఖం పట్టాడు. అక్టోబర్‌లో మరోసారి జరిగే ఇండియన్ కోచింగ్ క్యాంప్‌లో పాల్గొనాలని బీఎఫ్‌ఐ ఎన్‌ఐసీ కోచ్‌లు సూచించినట్టు భార్గవ్ చెబుతున్నాడు. భార్గవ్ ప్రస్తుతం ఇంటర్మీడియెట్ సెకెండియర్ చదువుతున్నాడు. భార్గవ్‌ను బాక్సింగ్ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బీఏ లక్ష్మణ్‌దేవ్, వంగా మహేష్, డీఎస్‌డీఓ డాక్టర్ కె.శ్రీధర్‌రావు, జిల్లా బాక్సింగ్ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు అభినందించారు.
తల్లిదండ్రులు, అన్నయ్య స్ఫూర్తితో బాక్సింగ్‌లో ప్రవేశం పొందాను. కోచ్ ఉమామహేష్, సంఘ పెద్దలు, కాలేజ్ ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో నిరంతరం సాధన చేస్తున్నాను. నేషనల్ మెడల్ సాధించి, ఇండియన్ కోచింగ్ క్యాంప్‌కు ఎంపికై నందుకు గర్వంగా ఉంది. భారత జట్టుకు ఎంపిక కావడం, ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడమే నా జీవిత ఆశయం.
– గంధం సత్యభార్గవ్, బాక్సింగ్ ప్లేయర్

బాక్సింగ్ భార్గవ్