
కొత్త ఎన్‌ఏసీల ముసాయిదా ఉత్తర్వులు జారీ
భువనేశ్వర్: రాష్ట్రంలో కొత్తగా 12 నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్ (ఎన్‌ఏసీ) ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో అంగుల్ జిల్లాలోని పల్లోలోహడా, సువర్ణపూర్ జిల్లాలోని బీర మహరాజ్‌పూర్, బాలాసోర్ జిల్లాలో బొస్తా, సిములియా, మయూర్‌భంజ్ జిల్లాలో బెట్నాటి, బంగిరిపొషి, చిత్తారా, రాయగడ జిల్లాలోని బిసంకటక్, సంబల్‌పూర్ జిల్లాలో రెంగాలి మరియు బమ్రా, భద్రక్ జిల్లాలో తిహిడి, ధుసురి చోటు దక్కించుకున్నాయి.
సైనికుడి వీరమరణం
భువనేశ్వర్: జమ్మూ – కాశ్మీర్ కిస్త్వార్‌లో కొండ చరియలు విరిగిపడి ఒడియా సైనికుడు మృతి చెందాడు. అమర జవాను అంగుల్ జిల్లా రాఖికమార్ గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ బిస్వాల్‌గా గుర్తించారు.
ఎచ్చెర్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎచ్చెర్లలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఐటీఐ, స్కిల్ హబ్ సెంటర్లలో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులకు శిక్షణను అందించనున్నారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు తెలిపారు. టెన్త్ ఆపై విద్యార్హత కలిగిన 18 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు కలిగిన యువకులు అర్హులని చెప్పారు. శిక్షణ పూర్తిచేసినవారికి సర్టిఫికెట్‌తోపాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని సుధాకర్ పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత తెలుపు సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, 2 పాస్‌ఫొటోలతో ఆగస్ట్ 20వ తేదీలోపు ఎచ్చెర్ల స్కిల్‌హబ్ సెంటర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 7989177887 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
టెక్కలి: తాను షాపు తెరవకపోయినా రూ.7,240ల విద్యుత్ బిల్లు వచ్చిందంటూ టెక్కలి పాత పెట్రోల్ బంక్ ఎదురుగా వాటర్ సర్వీసింగ్ సెంటర్ యజమాని కురుమోజు తేజ వాపోయాడు. తన చేయి విరిగిపోవడంతో గత రెండు నెలలుగా షాపు తెరవడం లేదని, అయినప్పటికీ స్మార్ట్ మీటర్ పుణ్యమా అని వేల రూపాయల విద్యుత్ బిల్లు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతకు మునుపు ప్రతి నెల రూ.700 లోపు బిల్లు వచ్చేదని వివరించాడు. స్మార్ట్ మీటర్ అమర్చిన కొత్తలో రూ.78 వేల బిల్లు వచ్చిందని, దీనిపై అధికారుల ఫిర్యాదు చేయగా రూ.700 బిల్లుకు అదనంగా మరో రూ.700 వేసి రూ.1400 వసూలు చేశారని తెలిపారు. అత్యధికంగా బిల్లుల మోత మోగిస్తున్న స్మార్ట్ మీటర్‌ను తక్షణమే తొలగించి తనకు వచ్చిన బిల్లును తగ్గించాలని కోరాడు.
విజిలెన్స్ కమిషనర్‌కు సత్కారం
శ్రీకాకుళం కల్చరల్: రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ అనిలచంద్ర పునేఠా శనివారం కలెక్టర్ బంగ్లా వద్ద పంచముఖ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, ఆర్డీవో కె.సాయిప్రత్యూష, ఆలయ కమిటీ సభ్యులు ఎల్.నందికేశ్వరరావు, రామలింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ గౌతు లచ్చన్నకు
ఘన నివాళి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న పోరాటాలు భావితరాలకు తెలియాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా శనివారం శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలి వద్ద ఆయన విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజిలతో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గౌతు లచ్చన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ వేడుకలుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ పైడిశెట్టి జయంతి, చౌదరి బాబ్జీ, రమణమాదిగ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావు, డీబీసీడబ్ల్యూఓ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
వజ్రపుకొత్తూరు: పూండి రైల్వే స్టేషన్ యార్డు సమీపంలో పట్టాలపై శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. మృతుడు గులాబీ టీ షర్టు, సిమెంట్ కలర్ షార్టు ధరించిన ఉన్నాడని, గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో మృతిచెంది ఉంటాడని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్‌పీ నెంబరు 9440627537కు తెలియజేయాలని కోరారు.