
రఘు మౌసా ఇక లేరు
భువనేశ్వర్: కటక్ మహా నగరం దొహి బొరా, ఆలూ దమ్ (పెరుగు గారె, బంగాళ దుంప కూర)కు ప్రసిద్ధి చెందింది. ఒడియా రుచికరమైన కాలక్షేప తినుబండారాల్లో ఈ వంటకం రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు సాధించింది. కటక్ నగరం సందర్శించే పర్యాటకులు సైతం దీని కోసం ఉత్సాహం చూపిస్తారు. దొహి బొరా, ఆలూ దమ్ ప్రియులకు దీని ఆవిష్కర్త రఘునాథ్ సస్మల్ రఘు మౌసాగా ప్రాచుర్యం పొందాడు. అయితే 91 సంవత్సరాల వయసులో శనివారం బిడానాసి గోపాల్ సాహిలో తన నివాసంలో వృద్ధాప్య అనారోగ్యంతో కనుమూశారు. 1950లో తన 15 సంవత్సరాల వయసులో ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఒక యుగం ముగిసిందని సర్వత్రా విచారం వ్యక్తం అవుతుంది. రఘు మౌసా ప్రత్యేక వ్యవహార శైలి స్థానికులు, పర్యాటకులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకునేది. సహజమైన దినుసులతో వండి సిద్ధం చేసిన కూరతో కూడిన పెరుగు గారె ఎవరైనా చెంచా లేకుండా ఆకుతో కుట్టిన దోనలో చేతితో తినాల్సిందే. ఈ వంటకానికి సేవు, పచ్చి ఉల్లి వగైరా అదనపు జోడింపులు లేకుండా సహజ రుచులతో నిండిన దొహి బొరా, ఆలూదమ్ కోసం వేచి ఉండేవారు. అమ్మకం ప్రారంభించిన ఒక్క గంటలో అమ్ముడుపోయేది. అయితే అతడు మరణించడంతో అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. అతని భౌతిక కాయానికి నివాళులర్పించారు.

రఘు మౌసా ఇక లేరు