
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
రాయగడ: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మహిళలు అన్నారు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ శ్మశానవాటికలో సామాజిక కార్యకర్త చలపతిరావు అధ్వర్యంలో మొక్కలను శనివారం నాటారు. ఔషధ మొక్కలతో పాటు నీడనిచ్చే సుమారు 200 మొక్కలను నాటారు. మొక్కల ఆవశ్యకత గురించి మహిళలకు చలపతిరావు అవగాహన కలిగించారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలని సూచించారు.
విక్రమదేవ్ వర్మ విగ్రహం ఏర్పాటు చేయండి
జయపురం: బహుముఖ ప్రజ్ఞాశాలి, జయపురం మహారాజు రాజర్శి విక్రమదేవ్ వర్మ విగ్రహాన్ని రాష్ట్ర విధాన సభా ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని జయపురం సాహిత్య పరిషత్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం మోహన్ చరణ్ మాఝికి ఒక లేఖను పంపించారు. అవిభక్త కొరాపుట్‌ను మొదట నందపూర్ రాజధానిగా జయపురం రాజులు పాలించారన్నారు. జిల్లా అభివృద్ధికి విక్రమదేవ్ వర్మ ఎంతో కృషి చేశారని తెలియజేశారు. అయితే ఆయనకు తగినంత గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన ఇప్పటికై నా విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
వైద్య శిబిరం
రాయగడ: స్థానిక గాయత్రీనగర్ సరస్వతీ శిశు మందిరంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. శిశు మందిరంలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా కంటి, దంత వైద్య పరీక్షలను చేపట్టారు. మొత్తం 182 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించగా, వారిలో 122 మందికి దంత సమస్యలు ఉన్నట్లు గుర్తించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అదేవిధంగా మరో 60 మందికి కంటి పరీక్షలను నిర్వహించారు. అనంతరం ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డాక్టర్ లక్ష్మీనారాయణ సాహు నేతృత్వంలో జరిగిన ఈ శిబిరంలో సాయి భక్తులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.
చేతబడి నెపంతో యువకుడి హత్య
రాయగడ: చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఒక యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలోని శశిఖాల్ పోలీస్‌స్టేసన్ పరిధి బొడొఅలుబడి పంచాయతీలోని గురుసిబడి గ్రామంలో చోటు చేసుకుంది. యువకుడికి గ్రామంలోని కొందరు బలవంతంగా విషం తాగించి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గ్రామ సమీపంలో తగులబెట్టారు. ఈ ఘటన అలస్యంగా వెలుగుచూసింది. తన అన్నయ్యను కొందరు గ్రామస్తులు హత్య చేశారని మృతుని తమ్ముడు శశిఖాల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ మేరకు 13 మందిని అరెస్టు చేసి శనివారం కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. గురుసిబడి గ్రామంలో నివసిస్తున్న రామారావు జిలకర (20) అనే యువకుడు గత కొన్నాళ్లుగా చేతబడి చేస్తున్నాడని గ్రామంలోని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై ఒకరోజు నిర్వహించిన గ్రామసభలో చేతబడి చేసి, గ్రామంలో అశాంతిని నెలకొల్పుతున్న రామారావును ఎలాగైన హత్య చేయాలని సంకల్పించుకున్నారు. ఈ క్రమంలో ఈనెల 8వ తేదీన రామారావును కొందరు యువకులు మాటల్లో పెట్టి ఒక పానీయంలో విషం కలిపి బలవంతంగా తాగించి దారుణ హత్యకు పాల్పడ్డారు. అనంతరం మృతి చెందాడని నిర్ధారించుకొని మృతదేహాన్ని గ్రామ సమీపంలో పెట్రోల్ పోసి తగులబెట్టారు.

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ