
ప్రైవేటు ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు
రాయగడ: జిల్లాలో గుణుపూర్‌లోని కపిల్‌పూర్ ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ బి.సరోజిని దేవి, జిల్లా అదనపు ముఖ్య వైద్యాధికారి డాక్టర్ మమత సాహులతో పాటు గుణుపూర్ ఎస్డీపీవో బబులి నాయక్, పద్మపూర్ తహసీల్దార్ శంకర్ బాగ్, గుణుపూర్ అగ్నిమాపక కేంద్రాధికారి రజనీకాంత్ గౌడా తదితరులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. లక్ష్మణ్ లావణ్య మాతృ చికిత్సాలయం, రీసెర్చ్ కేంద్రం పేరిట నిర్వహిస్తున్న ఈ ఆస్పత్రిపై పలు ఆరోపణలు అధికారుల దృష్టికి రావడంతో ఈ దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో పలు కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అమాయక ఆదివాసీ గర్భిణులు చికిత్స కోసం వస్తే వారి వద్ద నుంచి ఫీజుల పేరిట అధిక డబ్బులు గుంజుతున్నారని ఆరోపణల మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిసింది. కాగా గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రదీప్ కుమార్ పండ ఆధ్వర్యంలో ఈ ఆస్పత్రి నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రైవేటు ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు