
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: అధికార యంత్రాంగమంతా సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ పిలుపునిచ్చారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో 1వ, 2వ, 4వ, 7వ స్థాయీ సంఘాల సమావేశాల్లో పలు శాఖల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచు కుని అధికారులు పనిచేయాలన్నారు. సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున ముందస్తుగా సమాయత్తం కావాలన్నారు. కవిటి, సోంపేట ప్రాంతాల్లో కిడ్నీ రోగులకు డయాలసిస్ సౌకర్యాలు పెంచడం, అవసరమైన బెడ్లను కల్పించడం వంటి చర్యలు తక్షణమే చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పించన్లను వెంటనే మంజూరు చేయాలని ఎంపీడీవోల కు సూచించారు. డీడబ్ల్యూఎంఏ ద్వారా పూర్తయిన పనుల బిల్లులు తక్షణం చెల్లించాలని, పంచాయతీ రాజ్‌శాఖ కాలం చెల్లిన పనుల జాబితాను సమర్పించాలని ఆదేశించారు. ఉద్దానం పైప్‌లైన్ లీకేజీలను సరిచేయాలన్నారు. లోవోల్టేజి సమస్యలను పరిష్కరించాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం జరిగిన 3వ, 5వ, 6వ స్థాయీ సంఘాల సమావేశాల్లో కూడా పలు అభివృద్ధి పనుల ప్రగతిని సమీక్షిస్తూ, ప్రజా అవసరాల తీర్చడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.