
పూరీ జగన్నాథ ఆలయం కూల్చేస్తాం
భువనేశ్వర్ : పూరీ జగన్నాథుని మందిరం కూల్చేస్తామని ప్రాకార గోడల మీద ఉగ్రవాద బెదిరింపు రాతలు తీవ్ర కలకలం రేపాయి. వీటిని ఉగ్రవాద రాతలుగా భావిస్తున్నారు. బుఢి మా మందిరం గోడపై రెండు చోట్ల ఈ రాతలు కనిపించాయి. దీంతో ఆలయ పరిసరాలలో భద్రత పటిష్టం చేశారు. గోడపై రాసిన రాతల్లో సూచించిన నంబర్‌కు ఫోన్ చేయమని భద్రతా వర్గాలకు సవాల్ విసరడం గమనార్హం. ఈ రాతల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు సైతం చోటు చేసుకుంది. ఇది ఎవరు ఎందుకు చేశారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి
మృతి
భువనేశ్వర్: పశుమాంసం రవాణా చేస్తున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం చెందాడు. రౌర్కెలా నుంచి సంబలపూర్‌కు పశువుల మాంసం తరలిస్తుండగా జమ్మొబహల్ సమీపంలో కారు నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరి దర్యాప్తు ప్రారంభించారు.
గంజాయి కేసులో తీర్పు వెల్లడి
● నిందితుడు నిర్ధోషి
రాయగడ: గంజాయి అక్రమ రవాణా కేసులో తీర్పు వెలువడింది. కేసును విచారించిన గుణుపూర్ ఏడీజేఎం దేవదత్త పట్నాయక్ నిందితుడు నిర్ధొషిగా తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే 2024 జూన్ 21వ తేదీన గుణుపూర్ సమితి భీమాపూర్ కూడలిలో రెండు బస్తాలతో ఉన్న 40 కిలోల గంజాయిని అబ్కారీశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో పట్టుకున్నారు. గంజాయి రవాణాతో సంబంధం ఉందంటూ ప్రశాంత్ మాఝి అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కేసు విచారణకు రావడంతో సాక్షులను విచారించిన న్యాయస్థానం నిందితుడు ప్రశాంత్ మాఝి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు సరైన సాక్ష్యాధారాలు లేకపొవడంతో కేసును ఏడీజేఎం కొట్టివేయడంతోపాటు ప్రశాంత్ మాఝి నిర్ధోషని తీర్పునిచ్చారు.
హరిజన పద ప్రయోగం వద్దు
భువనేశ్వర్: రాష్ట్రంలో అన్ని విభాగాలు, శాఖలు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, సమాచార వ్యవహారాల్లో ‘హరిజన్’ అనే పద వినియోగం, ప్రయోగం నివారించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదం బదులుగా రాజ్యాంగబద్ధమైన ‘షెడ్యూల్డ్ క్యాస్ట్’ను ఆంగ్లంలో , ఒడియాలో దాని తగిన అనువాదాన్ని ఉపయోగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర షెడ్యూల్డ్ తెగలు, కులాల అభివృద్ధి, బలహీన – వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
స్కూల్ బస్సును ఢీకొట్టిన వ్యాన్
● విద్యార్థులకు స్వల్పగాయాలు
రాయగడ: అదుపుతప్పిన పికప్ వ్యాన్ ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం దెబ్బతినగా.. అందులో ఉన్న విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సదరు సమితి అమలాభట్ట వద్ద బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న చందిలి పొలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వ్యాన్‌ను స్వాధీనం చేసుకోగా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 50 మంది విద్యార్థులతో పెంట గ్రామం వైపు బస్సు వస్తున్న సమయంలో జేకేపూర్ నుంచి లెరువలి వైపు వెళుతున్న పికప్ వ్యాన్ అమలాభట్ట కూడలిలో అదుపుతప్పి బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

పూరీ జగన్నాథ ఆలయం కూల్చేస్తాం

పూరీ జగన్నాథ ఆలయం కూల్చేస్తాం