
స్వాతంత్య్ర వేడుకలకు అతిథిగా మంత్రి గోకులానంద
రాయగడ: స్థానిక గోవింద్ర చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 15వ తేదీన జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మంత్రి గోకులానంద మల్లిక్ ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు. ఆరోజు ఉదయం 8.30 గంటలకు జాతీయ పతాకావిష్కరణ, ప్రసంగం అనంతరం సాంస్కృతికి కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం జిల్లా జైలులో ఖైదీలకు, ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. ఈ మేరకు మైదానాన్ని జిల్లా యంత్రాంగం సిద్ధ చేస్తోంది.
గనుల తవ్వకాలు చేపట్టొద్దు
రాయగడ: సదరు సమితి ఇరుకుబడి పంచాయతీ పరిధి బాలపాడు గ్రామ సమీపంలో ఉన్న గనుల తవ్వకాలకు సంబంధించి మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో సంబంధిత అధికారులకు చుక్కెదురైంది. గ్రామంలోని గనులను తవ్వుకుంటూ పోతే తమ గ్రామంతో పాటు మరో 15 గ్రామాలు పర్యావరణపరంగా దెబ్బతినే అవకాశం ఉందని, అందువలన ఈ తవ్వకాలకు అనుమతించేదిలేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, రాష్ట్ర అటవీ శాఖ, పర్యావరణ, వాతావరణ విభాగానికి చెందిన అధికారులు ప్రజల అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు. సమావేశంలో జిల్లా అదనపు మేజిస్ట్రేట్ నిహారి రంజన్ కుహరొ, రాయగడ తహసీల్దార్ ప్రియదర్శిని స్వయి తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ మండపం సీజ్
జయపురం: స్థానిక మెయిన్ రోడ్డు బంకమఠం ప్రాంతంలోని బాబా సాహెబ్ కల్యాణ మండపాన్ని మున్సిపల్ అధికారులు సోమవారం తాళాలు వేసి సీజ్ చేశారు. కల్యాణ మండపాన్ని లీజుకి తీసుకున్న నిర్వాహకులు లీజు డబ్బు చెల్లించకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2017–18లో ప్రతి ఏడాది రూ.7 లక్షల లీజు తీసుకున్నారు. అయితే 2020 నుంచి డబ్బులు చెల్లికపోవడంతో పాటు నోటీసులకు స్పందించకపోవడంతో సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ అదనపు కార్యనిర్వాహక అధికారి పూజా రౌత్ తమ సిబ్బందితో వెళ్లి సీజ్ చేశారు. మండప నిర్వాహకులు డబ్బు చెల్లించకపోతే మున్సిపాలిటీనే బాధ్యతలు చేపడుతుందని వెల్లడించారు.
ఘనంగా జాతీయ రిమోట్ సెన్సింగ్ దినోత్సవం
పర్లాకిమిడి:
ఆర్.సీతాపురంలోని సెంచూరియన్ వర్సిటీలో మంగళవారం జాతీయ రిమోట్ సెన్సింగ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డీన్ (సోయెట్) డాక్టర్ ప్రఫుల్ల కుమార్ పండా అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్ డా.అనితా పాత్రో విచ్చేసి ప్రారంభించారు. దేశంలో మౌలిక సదుపాయాలు, విపత్తులను ముందుగా కనుగునేందుకు ఈ రిమోట్ సెన్సింగ్ సిస్టం ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మజీద్ ఫరూఖ్ మాట్లాడుతూ.. ఉపగ్రహాల ద్వారా శాటిలైట్ రిమోట్ సెన్సింగ్‌తో వాతావరణ మార్పులు గమనించగలమన్నారు. సివిల్ ఇంజినీరింగ్ శాఖ అధిపతి డాక్టర్ రాజీవ్ కుమార్ మఝి మాట్లాడుతూ.. రిమోట్ సెన్సింగ్ ద్వారా అంతర్ విభాగ స్వభావాన్ని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విపత్తుల దిశ తెలుసుకోగలమన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ డా.దుర్గాప్రసాద్ పాఢి తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర వేడుకలకు అతిథిగా మంత్రి గోకులానంద

స్వాతంత్య్ర వేడుకలకు అతిథిగా మంత్రి గోకులానంద

స్వాతంత్య్ర వేడుకలకు అతిథిగా మంత్రి గోకులానంద