
మైనర్ బాలికపై లైంగిక దాడి
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి మోటు పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న నక్కగూడ గ్రామంలో 14 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన వివాహిత యువకుడు గర్భవతిని చేసి పరారయ్యాడు. దీంతో ఆ యువకుడిపై మోటు పోలీసుస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బాలిక తండ్రి మరణించడంతో తల్లి కూలి పనులు చేస్తోంది. అలాగే బాలిక అన్నయ్య వలస కార్మికుడిగా ఇతర రాష్ట్రానికి వెళ్లాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికై నా చెబితే చంపుతానని భయపెట్టడంతో బాలిక నోరు మెదపలేదు. అయితే బాలిక శరీరంలో మార్పులు వస్తుండడంతో ఆమె తల్లి కలిమెల ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు గర్భిణీగా నిర్ధారించారు. దీంతో బాలికను నిలదీయగా యువకుడి విషయాన్ని తెలియజేసింది. అయితే అప్పటికే యువకుడు గ్రామం నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం బాలికకు 8 నెలలు నిండాయి. దీంతో గ్రామస్తుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురికి గాయాలు
రాయగడ: జిల్లాలోని గుడారి వద్దనున్న వంశధార నది వంతెన సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడ్డారు. గాయపడినవారిలో ఉర్లర్‌కొన గ్రామానికి చెందిన మంటూ సబర్, కపిలాస్ సబర్, రవుతగుడ గ్రామానికి చెందిన ఉపేంద్ర సబర్‌లు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుడారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. ఈ యువకులు ఒకే బైకుపై సోమవారం గుడారి వెళ్లి తిరిగి అదేరోజు రాత్రి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో బైకు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బీజేడీ సీనియర్ నేత సుషార్ సామల్ మృతి
కొరాపుట్: బీజేడీ సీనియర్ నాయకుడు సుషార్ సామల్ (చుంగా) (55) భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. చుంగా గత కొంతకాలంగా గుండె సమస్యతో బాధపడుతున్నారు. ఆయన నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాం ఎమ్మెల్యే, బీజేడీ జిల్లా అధ్యక్షుడు మనోహర్ రంధారికి అనుచరుడిగా ఉన్నారు. గత 20 ఏళ్లలో పార్టీలో జిల్లాస్థాయిలో అనేక పదవులు చేపట్టారు. ఈయన అంతిమ యాత్రలో బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పాల్గొన్నారు.
పరామర్శ
పర్లాకిమిడి: గంజాం జిల్లా దిగపోహండి ఎమ్మెల్యే సిద్ధాంత మహాపాత్రో తల్లి డా.కనక మహాపాత్రో ఇటీవల మృతి చెందారు. దీంతో ఆయనను పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మంగళవారం పరామర్శించారు.

మైనర్ బాలికపై లైంగిక దాడి