
రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు
పర్లాకిమిడి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు వలన రాష్ట్రంలోని రైతులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కిసాన్ సంఘటన్ అధ్యక్షుడు అభయ్‌కుమార్ సాహు అన్నారు. స్థానిక తెలుగు సొండివీధి కాంగ్రెస్ భవన్‌లో రైతుల పక్షాన సమర్ధన, కృషక్ ప్రిపరేటరీ సమావేశంలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు, సకాలంలో యూరియా అందడం లేదని మండిపడ్డారు. సకాలంలో సబ్సిడీ ఎరువులు అందజేయకపోవడం వల్ల బర్‌ఘడ్, సంబల్‌పూర్ జిల్లాల్లో యూరియా బస్తాలు బ్లాక్ మార్కెట్‌కు చేరుతున్నాయని విమర్శించారు. అలాగే 55 ఏళ్లు నిండిన రైతులకు రూ.10 వేల భృతి అందజేయాలని, వారిని ఫసల్ బీమా యోజనలో చేర్చాలని, అలాగే రైతులకు స్వస్థ్య బీమా కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. రానున్న అక్టోబర్, నవంబర్ మాసాల్లో గజపతి జిల్లా స్థానిక సమస్యలతో పాటు ప్రాంతీయ సమస్యలపై వివిధ సమితి కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు, రాస్తారోకోలు చేపడతామని తెలియజేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, తూర్పు ఒడిశా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు స్థితికాంత మహంతి, నార్త్ కాంగ్రెస్ నాయకులు తపన్ మిశ్రా, రతన్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత పండా తదితరులు పాల్గొన్నారు.