
గోడ మీద రాతలకు ఆధారాలు లభించాయి: ఎస్పీ
భువనేశ్వర్: పూరీ శ్రీమందిర్ ప్రాకార మార్గంలో దక్షిణం వైపు బుడి మా ఆలయం రాతి గోడపైన బెదిరింపు సందేశానికి సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయి. సీసీటీవీ రికార్డింగు ఆధారంగా ఉగ్రవాద దాడి బెదిరింపు రాతల వెనక ఉన్న వర్గాల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు సాగుతోందని పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పినాక్ మిశ్రా తెలిపారు. దీని కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఈ ప్రాంతంలో తిరుగాడుతున్న వ్యక్తి గోడ మీద ఏదో రాస్తున్నట్లు కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. సీసీటీవీలో అతని గుర్తింపు స్పష్టంగా కనిపించడం లేదు. ప్రత్యేక బృందం అతని కోసం వెతుకుతోంది. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత పూర్తి వివరాలు స్పష్టం అవుతాయని ఎస్పీ తెలిపారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
జయపురం: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోట్‌పాడ్ ఎకై ్సజ్ అధికారి నీలాద్రి బిహారి మిశ్ర అన్నారు. కోట్‌పాడ్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం, మత్తు పదార్థాలు సమాజానికి పట్టిన చీడపురుగులని ఆవేదన వ్యక్తం చేశారు. వీటివలన కుటుంబాలు, జీవితాలు నాశనమవుతున్నాయని పేర్కొన్నారు. నిషా విముక్త సమాజానికి విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పొణిరో సాగర్, ఉపాధ్యాయులు సుజిత్ సర్కార్, రొతికాంత మహంతి, మహిమ ముండ, శుభాషిస్ పండ, ఆకాశ బిబార్, ప్రభాషిణీ లామాల్, దమయంతి సాహు, సయిత గొలారి తదితరులు పాల్గొన్నారు.
8కిలోల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసులు బుధవారం రాత్రీ బలిమెల–చిత్రకొండ రహదారిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రెండు బైక్‌లతో ముగ్గురు వ్యక్తులు గంజాయితో పట్టుబడ్డారు. వీరిని అరెస్టు చేసి బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా చిత్రకొండలో కొన్న గంజాయిని కలిమెల సమితి ఎంవీ 79 గ్రామానికి తరలిస్తామని తెలిపారు. తూకం వేయగా 8 కిలోలు ఉంది.
నకిలీ విదేశీ మద్యం పట్టివేత
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా ఖోయిర్‌పూట్ సమితి కూడుములగూమ్మా పంచాయతీ సెంటర్‌లో ఉన్న విదేశీ మద్యం షాప్‌లో నకిలీ విదేశీ మద్యం పట్టుబడింది. నకిలీ మద్యంపై బలిమెల పోలీసులకు బుధవారం సమాచారం రావడంతో ఐఐసీ ధీరజ్ పట్నాయిక్ తన సిబ్బందితో కలిసి గురువారం దుకాణంపై దాడి చేశారు. కుడుములగుమ్మ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి కృష్ణచంద్ర హియాల్ కూడా తనిఖీలు చేయగా షాప్ మేనేజర్ మరో ఉద్యోగి పారిపోయారు. షాప్‌లో ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులను అరెస్టు చేసి మద్యం బాటిళ్లపై ఉన్న నకిలీ బ్రాండ్‌లను గుర్తించారు. కొంత సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని అభిలేష్ కుమార్ యాదవ్, లాలన్ కుమార్ యాదవ్‌లుగా గుర్తించారు.

గోడ మీద రాతలకు ఆధారాలు లభించాయి: ఎస్పీ