
బాలుడి అదృశ్యం.. గ్రామస్తుల ఆందోళన
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి రామగిరి పోలీసు స్టేషన్ తెండకాపదర్ గ్రామంలో 14 ఏళ్ల బాలుడు భగవాన్ శాంత జూలై 19 ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. గడ్డి కోసి వస్తానని వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తాము అన్ని చోట్లా గాలించినా భగవాన్ జాడ తెలియక రామగిరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. అయితే భగవాన్ ఒక మిత్రునితో కలసి జయపురం వెళ్లినట్లు తెలిసిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆ మేరకు కనుక్కుంటే అతడు రాయగడలో ఉన్నట్లు తెలిసిందని తెలిపారు. కానీ రామగిరి పోలీసుల దర్యాప్తుతో నిరాశకు గురయ్యామని బొయిపరిగుడ పోలీసు స్టేషన్‌లో ఆందోళన జరిపి ఫిర్యాదు చేశారు. కనిపించకుండా పోయిన భగవాన్‌ను వెతికేందుకు ఒక ప్రత్యేక టీమ్‌ను రాయగడ పంపుతామని బొయిపరిగుడ పోలీసు అధికారి రశ్మీ రంజన్ ప్రధాన్ వారికి హామీ ఇచ్చారు.