
అధికారుల పనితీరుపై నిఘా
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, సిబ్బంది పనితీరుపై పటిష్ట నిఘా పెట్టనుంది. దీనిలో భాగంగా ప్రజలకు సకాలంలో ప్రభుత్వ సేవలు అందించే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక లోక్‌సేవా భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అధ్యక్షతన మంగళవారం ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. దీనిలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ సేవలు కల్పించడంలో జాప్యం నివారణ, ప్రభుత్వ పథకాల అమలు, కార్యాచరణ బలోపేతం చేసే దిశలో 10 ప్రధాన అంశాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా అన్ని కార్యాలయాల్లో ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
కార్యదర్శులకు సూచనలు
● సీఎం కార్యాలయం నుంచి వచ్చే యూఐ నోట్స్‌పై తక్షణమే స్పందించాలి.
● అధికారులు సకాలంలో విధులకు హాజరవ్వాలి.
● అధికారులు పనితీరు మెరుగుపరచుకునేందుకు పూర్తి అవకాశం కల్పించాలి. ఆ తర్వాత కూడ తీరు మారకుంటే అనివార్య విరామం (సీఆర్‌ఎస్) మంజూరు.
● అన్ని జిల్లాస్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కృత్రిమ మేధసు (ఏఐ) కెమెరాలు ఏర్పాటు.
● ప్రజలకు సేవలు అందించడంలో జాప్యాలు పర్యవేక్షించబడతాయి. అక్టోబర్ నుంచి ముఖ్యమంత్రి డ్యాష్ బోర్డు ప్రారంభం.
● ప్రతినెలా 7వ తేదీన జిల్లా కలెక్టర్ కేంద్ర పథకాల అమలు, కార్యాచరణను సమీక్షిస్తారు.
● అటవీ, పర్యావరణ మరియు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలు ప్రతినెలా 12వ తేదీన సమీక్షిస్తాయి.
● బడ్జెటు నిధుల సద్వినియోగంతో ఆదాయం పెంపుదలపై అన్ని విభాగాలు దృష్టిని కేంద్రీకరించాలి.
● క్షేత్ర సందర్శనలపై అధికారులు దృష్టి పెట్టాలి.
సీఎస్ మనోజ్ ఆహుజా