
● పెద్ద మనసు
రాయగడ: పుట్టినరోజు అంటే విందూ, వినోదాలతో సరదాగా గడిపేవారిని చూసుంటాం. అయితే సదరు సమితి పెంట గ్రామానికి చెందిన వ్యాపారవేత్త దూడల శ్రీనివాస్ తన పుట్టినరోజు పురస్కరించుకొని చేపట్టిన సేవా కార్యక్రమం అందరి ప్రశంసలు పొందింది. ఆయన తన మిత్రులు, ఆత్మీయులతో కలిసి తాము నివసిస్తున్న పెంట (అమలాభట్ట) ప్రాంతం నుంచి కొత్తపేట వరకు సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నటువంటి జాతీయ రహదారిలో గుంతలను సొంత ఖర్చులతో పూడ్చి వేసేందుకు శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలిచారు. రాయగడ నుంచి రాష్ట్ర రాజధాని భువనేశ్వర్, బరంపురం వంటి ప్రధాన నగరాలకు వెళ్లేందుకు ఈ జాతీయ రహదారే ముఖ్యం. నిత్యం వందలాదిమంది ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఈ రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ రహదారిలో ఉన్నటువంటి గుంతలను సిమెంటు కాంక్రిట్‌తో పూడ్చి వేశారు. సహకరించాల్సిందిగా చందిలి పోలీసులకు ముందస్తుగా తెలియజేయడంతో పోలీసులు తమ సహకారాన్ని అందించారు. దీంతో దూడల శ్రీనివాస్‌ను స్థానికులు, వాహన చోదకులు అభినందించారు.