
అక్టోబర్‌లో సీఐటీయూ జిల్లా మహాసభలు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సోంపేటలో అక్టోబర్‌లో జరిగే సీఐటీయూ జిల్లా 12వ మహాసభలు విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ధరల పెరుగుదల, అవసరాలు దృష్టిలో పెట్టుకొని కార్మికుల కనీస వేతనం నెలకు రూ.26,000గా అమలు చేయాలని, కనీస పెన్షన్ రూ.10,000 ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను, అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు తదితర స్కీం వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. శ్యాంపిస్టన్ ప్లాంట్–2, రెడ్డీస్ లేబొరేటరీస్ పరిశ్రమల్లో కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించి వేతన ఒప్పందాలు చేయాలని, అక్రమంగా నిలుపుదల చేసిన కార్మిక నాయకులను విధుల్లోకి తీసుకోవాలని, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమల ప్రైవేటీకరణ చర్యలను మానుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు అల్లు మహాలక్ష్మి, జి.అమరావతి, ఎం.ఆదినారాయణమూర్తి, అల్లు.సత్యన్నారాయణ, కె.సూరయ్య, ఎన్.వి.రమణ, ఎన్.గణపతి, ఎస్.లక్ష్మీనారాయణ, బండారు మురళి, ఆర్.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.