
సిబ్బంది కొరత
రవాణా శాఖలో..
● కీలక ఏవో, ఆర్టీవో పోస్టులు ఖాళీ ● డీటీసీపైనే పనిభారం ● క్షేత్రస్థాయి తనిఖీలపై ప్రభావం
శ్రీకాకుళం రూరల్:
జిల్లా ఉప రవాణా శాఖాధికారి కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏఓ, ఆర్టీఓ వంటి కీలకమైన పోస్టులు కొన్ని నెలలుగా భర్తీ కాకపోవడంతో ఆ ప్రభావం ప్రస్తుత సిబ్బందిపై పడుతోంది. డీటీసీ విజయసారధి కార్యాలయానికి వచ్చిన ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా సిబ్బంది కొరత కారణంగా క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఇన్‌చార్జులుగా ఏఓ స్థానంలో ఓ గుమస్తా, ఆర్టీవో స్థానంలో ఓ ఇన్‌స్పెక్టర్‌ను ఏర్పాటు చేసుకొని వచ్చిన ఫైల్స్‌ను అప్‌డేట్ చేయిస్తున్నారు. ఈ ఏడాది 2025–26కు సంబంధించిన ప్రభుత్వ టార్గెట్ రూ.142.75 కోట్లు ఇవ్వగా ఉన్న సిబ్బందితోనే గడిచిన నాలుగు నెలల్లో రూ.37.16 కోట్లకు చేరుకున్నారు. గత ఏడాది రూ.163 కోట్లు టార్గెట్ కాగా రూ.36.89 కోట్లతో సరిపెట్టుకున్నారు.
తనిఖీలు అంతంత మాత్రమే..
ప్రధానంగా ఆర్టీవో కార్యాలయంలో వాహనాలు తనీఖీలకు సంబంధించిన ప్రక్రియ మోస్తారుగానే కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు 17 మంది ఉండాలి. ప్రస్తుతం ఒక్క అధికారి మాత్రమే ఉన్నారు. ఇన్‌సెక్టర్లు 10 మందికి గాను నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన ఆరుగురు డిప్యూటేషన్‌పై ఇతర జిల్లాల్లో విధులు నెరవేరుస్తున్నారు. ఇక రోడ్డు సేఫ్టీలు, డ్రైవర్లకు అవగాహన సదస్సులు, వాహనాల తనిఖీలు ఆయా ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షణలోనే కొనసాగాలి. సిబ్బంది కొరత కారణంగా వీటి ఊసే లేదు.
కార్యాలయంలోనూ అంతే..
ఆర్టీఓ జిల్లా ప్రధాన కార్యాలయంలోనూ సిబ్బంది కొరత వెంటాడుతోంది. మొత్తం 68 మంది సిబ్బంది వివిధ సెక్షన్‌లలో పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం 27 మంది మాత్రమే ఉన్నారు. కొంతమంది డిప్యూటేషన్‌పై బయట విధులు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు వాహనాలతో పాటు నాన్ ట్రాన్‌పోర్టులు, రిజిస్ట్రేషన్లు, వాహనాల బదిలీలు, ఫైనాన్స్ క్లియరెన్సులు, ఈకేవైసీలు వంటి పనులన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ పనులన్నీ డీటీసీ పర్యవేక్షణలో చేయిస్తున్నారు.
లేఖ రాశాం..
సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రధానమైన ఏవో, ఆర్టీవో పోస్టులు కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్నాయి. ఉన్న సిబ్బందితో పనులు చేయించుకుంటున్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటి ఫైల్స్ అప్పుడే క్లియర్ చేస్తున్నాం.
– ఎ.విజయసారథి,
జిల్లా ఉప రవాణా శాఖాధికారి

సిబ్బంది కొరత