
అక్కుపల్లి తీరం
అభివృద్ధికి దూరం..
● అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా శివసాగర్ బీచ్ ● కోట్లాది రూపాయల నిధులు నీటిపాలు
వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రాల్లో అక్కుపల్లి శివసాగర్ బీచ్ ఒకటి. నిత్యం పర్యాటకుల తాకిడితో సందడిగా ఉండే ఈ తీరం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంటోంది. శివసాగర్ తీరాన్ని పర్యాటకేంద్రంగా తీర్చిదిద్దేందుకు 2018లో కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయి. పనుల నిర్మాణంలో నాణ్యత లోపంతో రక్షణ గోడ కూలిపోయింది. అప్పట్లో సంభవించిన తిత్లీ తుఫాన్ ప్రభావంతో రెస్టారెంట్, విశ్రాంతి గదులు, మరుగుదొడ్ల కోసం ఏర్పాటు చేసిన షెడ్‌లు ధ్వంసం కావడంతో నిధులు నీటిపాలయ్యాయి. అప్పటి నుంచి అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.
సువిశాల తీరం..
విశాలమైన సముద్ర తీరం, పచ్చని చెట్లు, నీటిపై తేలియాడేలా కనిపించే పెద్ద పెద్ద రాళ్లు.. ఇలా అనేక ప్రకృతి అందాలు శివసాగర తీరం సొంతం. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలలోని పర్లాకిమిడి, పాతపట్నం, టెక్కలిపట్నం, గొప్పిలి, టెక్కలి, కాశీబుగ్గ, పలాస, సూదూర ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పర్యాటకులు నిత్యం తీరానికి చేరుకుని ఆనందంగా గడుపుతుంటారు. రథసప్తమి, మహాశివరాత్రి లాంటి ప్రత్యేక పర్వదినాల్లో పర్యాటకుల తాకిడితో తీరం జనసంద్రంగా మారుతుంది.
సమస్యలు ఇవే..
తీరంలో అనేక సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రధానంగా మంచినీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు, దుస్తులు మార్చుకునేందుకు గదులు, విశ్రాంతి గదులు, వాహనాలు పార్కింగ్ వంటివి లేక సందర్శకులకు ఇబ్బందులు తప్పడం లేదు. బీచ్ రోడ్డులో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టకపోవడం, తీరం ప్లాస్టిక్, మందుబాటిళ్లు, ఇతర వ్యర్థాలతో అధ్వానంగా దర్శనమిస్తోంది.
అసాంఘిక కార్యక్రమాలు..
తీరం వెంబడి పచ్చని కొబ్బరి, జీడి తోటలు ఉండటంతో అసాంఘిక కార్యక్రమాలకు సైతం అడ్డాగా మారింది. ఆకతాయిలు, మందుబాబులు తీరంలో వెకిలి చేష్టలు చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ మద్యం సీసాలు పడేస్తుండటంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. తోటలు పేకాట రాయుళ్లకు అడ్డాగా మారాయని స్థానికులు వాపోతున్నారు.
అభివృద్ధి చేయాలి..
విశాలమైన సముద్ర తీరాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ప్రస్తుతం తీరంలో ఎక్కడపడితే అక్కడ చెత్త చెదారం పేరుకుపోయి అధ్వానంగా ఉంది.
– పి.దేవయ్య, వజ్రపుకొత్తూరు
వసతులు లేవు..
కుటుంబ సభ్యులతో సరదాగా తీరంలో గడుపుదామని వస్తే సరైన సదుపాయాలు లేవు. ప్రధానంగా మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పాలకులు స్పందించి వసతులు ఏర్పాటు చేయాలి.
– పి.మోహన్, సారవకోట

అక్కుపల్లి తీరం

అక్కుపల్లి తీరం

అక్కుపల్లి తీరం

అక్కుపల్లి తీరం