
ఉపాధ్యాయులతో బీఈఓ కార్యాలయం ముట్టడి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి కార్యాలయాన్ని సమితిలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు శనివారం ముట్టడించారు. తమకు వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. సమితిలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు బీఈవో సుకాంత కర్తామీని చుట్టుముట్టి జీతాలు ఇప్పించాలని నిలదీశారు. తాను జిల్లా విద్యాధికారికి తెలియజేసి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని బీఈవో వారికి హామీ ఇవ్వడంతో శాంతించి ఆందోళనను విరమించారు. అనంతరం ఉపాధ్యాయులు మీడిూాతో మాట్లాడుతూ.. బొయిపరిగుడ సమితిలో వివిధ పాఠశాలల్లో ఎక్స్ కేడర్ ఉపాధ్యాయులు 90 మంది పనిచేస్తున్నారని వెల్లడించారు. వారిలో నలుగురు గణశిక్షా ఉపాధ్యాయులని, ఆరుగురు జూనియర్ ఉపాధ్యాయులు కాగా సహాయక ఉపాధ్యాయులు 50 మంది, ఒక పీటీఐ, మిగతా వారు సాధారణ ఉపాధ్యాయులని వివరించారు. బ్లాక్ బీఈడీ కార్యాలయంలో ఏబీఈడీ పోస్టు ఖాళీగా ఉండటంతో తమకు జీతాలు చెల్లలించలేదన్నారు. అధికారులు తక్షణమే జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.