
విశ్వవిద్యాలయాలు ప్రపంచ శ్రేణి పౌరులను తీర్చిదిద్దాలి:
భువనేశ్వర్: విశ్వ విద్యాలయాలు నైతిక, సామాజికంగా బాధ్యతాయుతమైన, ప్రపంచ శ్రేణి సమర్థులైన పౌరులను కూడా రూపొందించడంలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. బరంపురం విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవం, బరంపురం విజ్ఞాన విద్య, పరిశోధన సంస్థ (ఐజర్) పంచమ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. పట్టభద్రులు ఉద్యోగం, ఉపాధికి పరిమితం కాకుండా జ్ఞాన సరిహద్దుల విస్తరణలో వారధులుగా నిలిచి సృజనాత్మక ఆవిష్కరణలతో ఉజ్వల సమాజ నిర్మాతలుగా ఎదగాలని విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. సామాజిక దృక్పథంతో నైతిక ఆచరణతో జీవితాంతం అభ్యాసకులుగా కొనసాగాలని ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోని అగ్రగామి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఆవిర్భవిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. స్వావలంబన సాధనతో మాత్రమే ఇది సాధ్యం అవుతుందన్నారు. ఈ ప్రయాణంలో విశ్వవిద్యాలయాలు డిగ్రీ ప్రదానం చేసే సంస్థలుగా కాకుండా పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్య ఆధారిత అభ్యాసానికి శక్తివంతమైన కేంద్రాలుగా మారాలని తెలిపారు. కార్యక్రమంలో బరంపురం పార్లమెంట్ సభ్యులు ప్రదీప్ కుమార్ పాణిగ్రహి, అస్కా పార్లమెంటు సభ్యురాలు అనితా శుభదర్శిని, రాష్ట్ర ఉన్నత విద్యా విభాగం మంత్రి సూర్య వంశీ సూరజ్, వైస్ ఛాన్సలర్ గీతాంజలి దాస్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ గౌరవ డిగ్రీలను పొందిన వారిలో భారత దేశ క్షిపణి మహిళ డాక్టర్ టెస్సీ థామస్, ప్రముఖ అణు భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ అజిత్ కుమార్ మహంతి, ‘మిల్లెట్స్ రాణి‘ రైమతి గివురియా ఉన్నారు. 52 మంది పరిశోధకులకు పీహెచ్‌డీ డిగ్రీలు, నలుగురు డి.లిట్ డిగ్రీలను పొందగా, 38 మంది విద్యార్థులు ఉత్తమ ఉత్తీర్ణతతో గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు.