
12న బిజూ పట్నాయక్ విగ్రహావిష్కరణ
జయపురం: బీజేడీ పార్టీ శ్రేణులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మాజీ ముఖ్యమంత్రి, ఉత్కళ వరపుత్రుడు బిజూ పట్నాయక్ (బిజానంద పట్నాయక్) శిలా విగ్రహాన్ని ఈ నెల 12వ తేదీన ఆవిష్కరించనున్నారు. స్థానిక పాత బస్టాండ్, పట్టణ పోలీసు స్టేషన్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బిజూ బాబు విగ్రహం ఏర్పాటు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. విగ్రహం చుట్టూ స్టీల్ రెయిలింగ్ పనులు జరుగుతాయని జయపురం మున్సిపాలిటీవర్గాలు తెలిపాయి. కొన్నేళ్ల నుంచి బిజూ పట్నాయక్ విగ్రహం మున్సిపాలిటీ కార్యాలయంలో పడి ఉంది. రాష్ట్రంలో ఒక మహోన్నత వ్యక్తి విగ్రహం ఎక్కడా స్థాపించకుండా మూలన పడేయటాన్ని బీజేడీ శ్రేణులే కాకుండా సాధారణ ప్రజలు కూడా విమర్శించారు. బీజేడీ శ్రేణులు, మాజీ మంత్రి, రాష్ట్ర బీజేడీ ఉపాద్యక్షులు రబినారాయణ నందో నేతృత్వంలో పలు ఆంధోళనలు జరిపారు. అందుకు స్పందించిన మున్సిపల్ అధికారులు మూడు నెలల కిందట పట్టణ పోలీసు స్టేషన్, పాత ఓఎస్‌ఆర్‌టీ బస్టాండ్ మధ్య బిజూ పట్నాయక్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. తరువాత విగ్రహ సింహాసనం ( విగ్రహం ప్రతిష్టించే దిమ్మ)ను, దాని చుట్టూ స్టీల్ రెయిలింగ్ మొదలగు పనులు చేసేందుకు నిర్ణయించారు. పనులను యుద్ధప్రాతిపదిన చేస్తున్నారు. పనులు సకాలంలో పూర్తి చేసి ఈనెల 12వ తేదీన విగ్రహావిష్కరణ చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.