సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
● జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
● మీకోసంలో 87 అర్జీలు స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: పెండింగ్‌లో ఉన్న అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(మీకోసం)లో ఆయన 87 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తహసీల్దార్ల వద్ద వివిధ సర్టిఫికెట్లు పెండింగులో ఉన్నాయని, పెండింగ్‌కు గల కారణాలు తెలియజేయాలన్నారు. సకాలంలో సర్టిఫికెట్లు జారీ చేయకుంటే విద్యార్థులు ఇబ్బందులు పడతారన్నారు. సత్వరమే సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. రైస్ కార్డులు పెండింగులో లేకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, సర్వే అండ్ లాండ్ రికార్డులు, మహిళా శిశు సంక్షేమం, రిజిస్ట్రేషన్, సర్వశిక్ష అభియాన్, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, ఏపీఈపీడీసీఎల్, జీజీహెచ్ తదితర శాఖలపై అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో ఎల్‌ఎన్ వి.శ్రీధర్‌రాజ తదితరులు పాల్గొన్నారు.


