అవగాహన తప్పనిసరి
సంక్షేమ పథకాలపై..
భువనేశ్వర్: అధికారులే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. ప్రజలకు, ముఖ్యంగా సమాజంలోని పేద, బలహీన వర్గాలకు మెరుగైన సేవలందించడానికి సమగ్ర సమాచారం అవసరమని చెప్పారు. గోపబంధు అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందుతున్న సహాయ కార్మిక అధికారి (ఏఎల్‌ఓ), అదనపు జిల్లా సంక్షేమ అధికారుల (ఏడీడబ్ల్యూఓ)ను ఉద్దేశించి బుధవారం గవర్నర్ ప్రసంగించారు. అధికారులు తమ విభాగాలకు సంబంధించిన పథకాలకే పరిమితం కాకండా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని పథకాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎమ్‌ఎంవై), ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై), సుభద్ర యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) వంటి అనేక ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు సమాజంలో పలు వర్గాల కోసం ఉద్దేశించబడినవిగా పేర్కొన్నారు. కార్మికులు, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాలకు పథకాల లబ్ది చేకూర్చేందుకు అధికారులు సమగ్ర సమాచారం కలిగి ఉండాలన్నారు. స్కాలర్‌షిప్‌లు, న్యాయ సహాయం, పరిహారం, కులాంతర వివాహాలకు మద్దతు, బలహీన గిరిజన వర్గాలకు బీమా సౌకర్యం వంటి ప్రయోజనాలను పొందేలా అధికారులు పనిచేయాలన్నారు. ఏఎల్‌ఓ శిక్షణార్థులతో మాట్లాడుతూ వారిని కార్మికుల హక్కుల సంరక్షకులుగా అభివర్ణించారు. కార్మిక చట్టాలు అమలు, వాస్తవ కార్యాచరణ, న్యాయబద్ధంగా వేతనాలు చెల్లించడం, సురక్షిత పని ప్రదేశాలు కల్పించడం ప్రధాన కర్తవ్యమని చెప్పారు. అసంఘటిత కార్మిక రంగంలో వలస కార్మికులకు మద్దతు, రక్షణ కల్పించేందుకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.బి.ఎస్.రాజ్‌పుట్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు సమగ్ర సమాచారం కలిగి
ఉండాలి
శిక్షణా కార్యక్రమంలో గవర్నర్
కంభంపాటి హరిబాబు
అవగాహన తప్పనిసరి


