ప్రకృతి విపత్తులపై ప్రజలను అప్రమత్తం చేయండి
కొరాపుట్: రానున్న వర్షాకాలంలో వచ్చే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని రాష్ట్ర సాంఘిక, సంక్షేమ, ప్రాథమిక విద్య, మైనారిటీ శాఖ మంత్రి నిత్యానందో గోండో సూచించారు. శనివారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మిషన్ శక్తి హాల్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రసంగించారు. జిల్లావ్యాప్తంగా నదులు, కాలువలు దెబ్బతిన్న గట్లు ముందస్తుగా గుర్తించి మరమ్మతులు చేయాలన్నారు. వరదలు రావడానికి ముందే జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన అనుమానిత ప్రాంతాల్లో మందులు, మిల్క్ పౌడర్, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, బెల్లం, అటుకులు సిద్ధం చేయాలని సూచించారు. గర్భిణులను గ్రామాల్లో గుర్తించి కాన్పు సమయానికి ముందే ఆస్పత్రులకు చేర్చాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్, అగ్నిమాపక బృందాలకు అవసరమైన సామగ్రి ముందే సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో, ఎమ్మెల్యేలు మనోహర్ రంధారి, గౌరీ శంకర్ మజ్జి, మున్సిపల్ చైర్మన్ కునునాయక్ తదితరులు పాల్గొన్నారు.


