కర్ణపాడులో ఏనుగుల బీభత్సం
రాయగడ: జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి కర్ణపాడు గ్రామంలో ఆదివారం రాత్రి రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో గల గొట్టపు బావిని పీకిపారేశాయి. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులు చెంది బితుకుబితుకుమంటూ రాత్రంతా గడిపారు. అనంతరం గ్రామంలో గల అరటి, మామిడి, పనస చెట్లను ధ్వంసం చేశాయి. సమాచారం తెలుసుకున్న సికరపాయి అటవీ శాఖ ఫారెస్టర్ పీకే జెన్న, వన రక్షకుడు రామ సామల్ సంఘటన జరిగిన గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన బాధిత కుటుంబాల వివరాలు తెలుసుకున్నారు. సేకరించిన వివరాలను సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నయవంచకుడిపై పోలీసులకు ఫిర్యాదు
కొరాపుట్: ప్రేమ పేరుతో నమ్మించి 16 ఏళ్ల బాలికను గర్భవతిని చేసి పరారైన నయవంచకుడిపై చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న హిర్లి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల గిరిజన బాలికను ప్రేమ పేరుతో అదే ప్రాంతానికి చెందిన షేక్ అలం హుస్సేన్ నమ్మించాడు. నిజమని నమ్మిన బాలిక అతనికి సర్వం అర్పించడంతో గర్భం దాల్చింది. అయితే అనంతరం అతను కనిపించకుండా పోవడంతో స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించింది. వారి సహకారంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో షేక్ అలం హుస్సేన్‌పై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.
ఘాట్ రోడ్డులో లారీ
బోల్తా
కొరాపుట్: ఘాట్ రోడ్డులో కర్రల లోడుతో ఉన్న లారీ బోల్తా పడింది. సోమవారం కొరాపుట్–జయపూర్ మార్గంలో ఘాట్ రోడ్డులో మలుపు వద్ద ఏపీ 35 0588 నంబర్ గల లారీ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. దాంతో కర్రలు రోడ్డుకి అడ్డంగా పడ్డాయి. వాహనాలు దారి లేక ఆగిపోయాయి. వెంటనే లారీ సిబ్బంది అడ్డంగా ఉన్న కర్రలు తొలగించి మార్గం సుగమం చేశారు.
కాశీపూర్‌లో ఇద్దరు ఆత్మహత్య
రాయగడ : జిల్లాలోని కాశీపూర్ సమితి టికిరి పంచాయతీలోని వివాహిత కాంచన్ మాఝి (20 ) ఉరి వేసుకుని ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఆమెకు ఏడాది కిందట కంసారిగుడ గ్రామానికి చెందిన మున్నా మాఝితో వివాహమైంది. భార్యభర్తల మధ్య వివాదాలు చోటు చేసుకోవడంతో ఆమె తన అక్క వద్ద ఉంటోంది. ఆదివారం నాడు కూలి పనులకు వెళ్లిన కాంచన ఇంటికి తిరిగి రాకపొవడంతో అక్క వెతికింది. సమీపంలొ గల ఒక చెట్టు కొమ్మకు వేలాడుతూ కాంచన మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అదే రోజున కాశీపూర్ గ్రామంలోని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కాశీపూర్ అటవీ శాఖ రేంజ్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే బాలిక మతిస్థిమితం బాగులేకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
కర్ణపాడులో ఏనుగుల బీభత్సం


