ఉద్యమాలతోనే వైద్య కళాశాల సాధించాం
కొరాపుట్: ఉద్యమాలతోనే కొరాపుట్‌లో ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల సాఽధించామని జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి ప్రకటించారు. సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలోని ఆడిటోరియంలో జరిగిన వైద్య విద్యార్థుల యూనియన్ నిర్వహించిన వార్షికోత్సవ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కళాశాల ఏర్పాటు కోసం తాము అనేక ఉద్యమాలు చేశామన్నారు. నాడు న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 7 రోజులు ఆందోళన చేసిన విషయం గుర్తు చేశారు. ప్రస్తుతం కళాశాల సమస్యలు పరిష్కారం కోసం విద్యార్థులు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు కళాశాల ఆవరణలో ఉన్న లక్ష్మణ్ నాయక్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వేదిక మీద ఒడిస్సీ నృత్య ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో కళాశాల డీన్ సుకాంత్ సాహు, డాక్టర్ జయంత్ పండా, యూనియన్ సలహాదారుడు డాక్టర్ ప్రతిప్ కుమార్ జెన్నా, విద్యార్థి సంఘం అధ్యక్షుడు బాదల్ కుమార్, కార్యదర్శి హిమాంశ్ దాస్ పాల్గొన్నారు.
ఉద్యమాలతోనే వైద్య కళాశాల సాధించాం


